చోరీ జరిగినా కేసు నమోదు చేయడం లేదు | - | Sakshi
Sakshi News home page

చోరీ జరిగినా కేసు నమోదు చేయడం లేదు

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సత్తెనపల్లికి చెందిన దివ్యాంగురాలు గతంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి అధికారుల దృష్టికి 105 ఫిర్యాదులు

నరసరావుపేటరూరల్‌: ఇంట్లో చోరీ జరిగిందని బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు దొంగిలించారని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని అంగవైకల్యంతో బాధపడుతున్న సత్తెనపల్లికి చెందిన శ్రీదేవి జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లికి ఫిర్యాదు చేసింది. రెండ వారాల కిందట పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా సత్తెనపల్లి పోలీసులు స్పందించలేదని తెలిపింది. ఆగస్ట్‌ 20వ తేదీ గిద్దలూరులో నివసిస్తున్న సోదరి వద్దకు వెళ్తున్నట్టు డోర్‌ లాక్‌ రిపోర్ట్‌ ఇచ్చినట్టు తెలిపారు. ఈనెల 28వ తేదీ తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం తీసి ఉందని, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నట్టు వివరించారు. 30 సవర్ల బంగారం, డాక్యుమెంట్లు, నగదు అపహరించినట్టు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అంకాళ్ల శ్రీనివాసరావు, అంకాళ్ల అనూష, వుగ్గం సుబ్బారావులు చోరీకి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై గత నెల 21వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. నిందితులు పలుకబడి ఉన్న వారు కావడంతో మాకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి అంశాలపై 105 ఫిర్యాదులు అధికారులకు అందాయి. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి ఉత్తమ సేవలు అందించాలని ఎస్పీ తెలిపారు. మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్ధాయిలో విచారణ వేగవంతం చేయాలని, చట్టప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement