మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

యువతి అదృశ్యంపై కేసు నమోదు

కారెంపూడి: గత నెల ఒకటో తేదీ కారెంపూడిలో జరిగిన రమావతు శ్రీలక్ష్మీభాయి (35) హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కారెంపూడి సీఐ ఆవుల భాస్కర్‌ సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు రమావతు బాబానాయక్‌ ఆమైపె కర్రతో దాడి చేయగా, మల్లిభాయి, సీతాభాయిలు కూడా మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంటి బెడ్‌ రూంలోకి తీసుకెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. హత్యకు ఉపయోగించిన కర్రను బెడ్‌ రూంలో ఆమె తల నుంచి కారిన రక్తాన్ని తుడిచిన వస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులకు హత్యకు గురైన శ్రీలక్ష్మీభాయికి మధ్య బంగారం విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మీభాయి లేకపోతే బంగారంతోపాటు పొలం, ఇంటిపై కూడా తమకు వాటాలొస్తాయని నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు. మొదటి నిందితుడు బాబానాయక్‌పై బెల్లంకొండ, నకరికల్లు, దాచేపల్లి, క్రోసూరు పోలీస్‌ స్టేషన్లలో ఆరు దొంగతనం కేసులున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

నాపరాయి లారీలను

అడ్డుకున్న గ్రామస్తులు

రెంటచింతల: మండలంలోని గోలి గ్రామంలో రెండు రోజులుగా నాపరాయి లారీల రాకపోకలను గోలి గ్రామస్తులు నిలిపివేశారు. మైనింగ్‌ శాఖ నుంచి అనుమతి(లీజ్‌) లేకుండా గోలి గ్రామ శివారులో నున్న క్వారీ నిర్వాహకులు ఓ ప్రైవేటు కంపెనీకి అక్రమంగా టన్నుకు రూ. 1200 చొప్పున చెల్లిస్తూ వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. గ్రామంలో కిందస్థాయి సిబ్బంది ఓ చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసుకుని లారీకి రూ.100 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తూ ఆ నగదును గ్రామాభివృద్ధికి వినియోగించకుండా పక్కదారి పట్టిస్తున్నారని గ్రామంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు నాపరాయి లారీలను క్వారీలోకి వెళ్లకుండా రెండు రోజులుగా గ్రామస్తులు అడ్డుకున్నారు. మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారించి వాస్తవాలను వెలికితీసి నాపరాయి(గనులు) ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్‌ తీసుకుంటూ నగరంలోని లేడీస్‌ హాస్టల్‌లో ఉంటున్న యువతి అదృశ్యంపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం పల్నాడు జిల్లాకు చెందిన యువతి (23) నగరంలోని ఓ హాస్టల్‌లో చెల్లితో కలిసి ఉంటూ, సూర్యారావుపేటలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతోంది. ఈ నెల మూడో తేదీన శిక్షణ కోసం హాస్టల్‌ నుంచి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో అదే హాస్టల్‌లో ఉంటున్న ఆమె చెల్లి విచారించగా ఇంటికి కూడా వెళ్లలేదని తెలిసింది. దీంతో సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దేవాదాయ శాఖ జోన్‌–1 స్టాండింగ్‌ కౌన్సిల్‌గా శ్రీనివాస చక్రవర్తి

పట్నంబజారు:దేవదాయ, ధర్మదాయ శాఖ జోన్‌–1 స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నగరానికి చెందిన న్యాయవా ది శ్రీనివాస చక్రవర్తి పందరబోయిన నియమితులయ్యారు. దేవదాయ శాఖ జోన్‌ –1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన దేవదాయ శాఖ కేసులను పెదకాకానిలోని దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ కోర్టులో ఆ శాఖ తరపున వాదించను న్నారు. గుంటూరులో న్యాయవాదిగా ఆయన ఎంతో కాలం నుంచి ప్రాక్టీస్‌ నిర్వహిస్తున్నారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

నేడు స్థానిక ఎన్నికలపై

రీజినల్‌ కాన్ఫరెన్స్‌

నెహ్రూనగర్‌: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల–2026 సన్నద్ధతపై మంగళవారం గుంటూ రు మెడికల్‌ కాలేజీలోని జింఖానా ఆడిటోరియంలో ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. రాయపూడి మున్సిపల్‌ పరిపాలన శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) ప్రతిపాదన మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహించనున్నారు. గుంటూరు రీజియన్‌ పరిధిలోని సుమారు 700 మంది రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) నివేదికలతో హాజరుకావాలని కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement