నరసరావుపేట రూరల్: ప్రతి రైతు శాస్త్రవేత్త తమ పొలాల్లో చెట్లను వ్యవసాయంలో అంతర్భాగంగా చేసుకుని సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని డీపీఎం అమలకుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇండో– జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సహకారంతో శాస్త్రవేత్తలు, మెంటర్లకు శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. తిరుపతి, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, పల్నాడు జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లు శిక్షణలో పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ తరగతుల్లో ప్రకృతి వ్యవసాయ విధానాలు, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న వ్యవసాయ నమూనాలు, వాటి ద్వారా పొందుతున్న ఫలితాలు, రైతుల అనుభవాలు, క్షేత్ర పరిశీలన వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో అమలకుమారి పాల్గొని రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లతో చర్చించారు. తమ క్షేత్రాల్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ నమూనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీపీ భవాని రాజు, విజయలక్ష్మి, మౌనిక, ఓబులమ్మ, మునిరాజులు పాల్గొన్నారు.
డీపీఎం అమలకుమారి


