ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన ‘సింభా’ | - | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన ‘సింభా’

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

నరసరావుపేటరూరల్‌: జిల్లా పోలీస్‌ డాగ్‌ సింభా రాష్ట్ర స్థాయి పోటీలలో అద్బుత ప్రతిభ కనబర్చి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. మంగళగిరి సీటీసీలో పది నెలల శిక్షణ అనంతరం నిర్వహించిన పోటీలలో ట్రాకింగ్‌ విభాగంలో ప్రథమ స్థానం, ఎక్స్‌ప్లోజివ్‌ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనభర్చిన సింభాను జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి, అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరిలు అభినందించారు. సింభాకు శిక్షణ అందించిన డాగ్‌ హ్యాండ్లర్స్‌ ఉమామహేష్‌, నాగప్రసాద్‌, ఆర్‌ఐ ఎం.రాజా, ఏఆర్‌ఎస్‌ఐ థామస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కాలం చెల్లిన మందుల విక్రయాలపై ఫిర్యాదు

మెడికల్‌ దుకాణంలో దాడులు నిర్వహించిన ఈగల్‌, డ్రగ్‌ అధికారులు

నరసరావుపేట టౌన్‌: గడువు తీరిన ఔషధాలతో పాటు బిల్లులు లేకుండా మందులు విక్రయిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుతో సోమవారం ఈగల్‌, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మెడికల్‌ దుకాణంపై దాడులు నిర్వహించారు. కోటసెంటర్‌లోని ఓ ఔషధ దుకాణంలో కాలం తీరిన ఔషధాలు విక్రయిస్తున్నారని, దాంతో పాటు బిల్లులు లేకుండా మందులను వినియోగదారులకు అందిస్తున్నారని ఈగల్‌ అధికారిక వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈగల్‌ ఎస్‌ఐ రాజీవ్‌ కుమార్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్వీన్‌ సుల్తానా సిబ్బందితో ఆరోపణలు వచ్చిన మెడికల్‌ దుకాణానికి చేరుకున్నారు. దుకాణంలో తనిఖీలు నిర్వహించారు.

హత్యల వెనుక వికృత ఆలోచన

నరసరావుపేట టౌన్‌: ఒక హత్య కేసు దర్యాప్తు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన మరో హత్య కేసు మిస్టరీని ఛేదించింది. పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారించగా.. మరో పాత హత్య కేసు వెలుగులోకి వచ్చింది. హత్య చేసి వారి శరీర భాగాలను కత్తిరిస్తే బలం వస్తుందన్న వికృత ఆలోచనలతో నిందితుడు నేరాలకు పాల్పడుతున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు.. గత నెల 29వ తేదీ కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌ ఆవరణలో నిద్రిస్తున్న గాసి రాజేష్‌(35) హత్య జరగడం.. కత్తెరతో మృతుడి మర్మాంగంపై ఉన్న చర్మం కత్తిరించబడడం తెలిసిందే. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సమీపంలో లభ్యమైన సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా నిందితుడు బరంపేటకు చెందిన కసుపర్తి నిఖిల్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎనిమిదేళ్ల నాటి హత్య కేసు ఛేదన..

ప్రస్తుత హత్యతో పాటు మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 2018 జనవరి నెలలో కోట సెంటర్‌లో నిద్రిస్తున్న నాగరాజు అనే వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసి అతని ఎడమచేతి మధ్యవేలును కత్తిరించుకొని వెళ్లినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఇతరులను హత్యచేసి వారి శరీరా భాగాలను కత్తిరిస్తే తనకు బలం, శక్తులు వస్తాయని పదేపదే కలలు వచ్చేవని నిందితుడు విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కారణంతో ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులను, హత్య సమయంలో నిందితుడు ధరించిన రక్తపు మరకలు కలిగిన దుస్తువులను అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒక హత్య కేసు దర్యాప్తులో 8 ఏళ్ల నాటి హత్య కేసును వెలుగులోకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించిన నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు, వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌, ఎస్‌ఐ వంశీ కృష్ణలను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement