బఫర్‌ జోన్‌ ఆక్రమిస్తున్నా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

బఫర్‌ జోన్‌ ఆక్రమిస్తున్నా పట్టించుకోరా?

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి

ఆక్రమణకు గురైన స్థలాల పరిశీలన

బాధ్యులపై చర్యలు కోరుతూ డీటీకి వినతిపత్రం అందజేత

ముప్పాళ్ల: పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ బఫర్‌ జోన్‌ కుడి కట్టకు ఒక న్యాయం...ఎడమ కట్టకు మరో న్యాయం ఉంటుందా...కళ్ల ముందు ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముప్పాళ్లలోని పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ కుడి, ఎడమ వైపున బఫర్‌ జోన్‌ల ఆక్రమణలను వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కృష్ణా నది కరకట్టను ఆక్రమిస్తే ఆ పార్టీ చోటా నాయకులు కాల్వకట్టలు, చెరువులు ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ కాలనీ వాసుల శ్మశానవాటికకు స్థలం కేటాయించమంటే కుదరదు అని చెప్పిన ఎన్నెస్పీ అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. అప్పట్లో ఎన్నెస్పీ కాల్వకు భూమిని ఇచ్చిన రైతు కృష్ణమూర్తి పైపొలానికి వెళ్లేందుకు దారి లేదని చెప్పిన అధికారులు, సుమారు 0.20 సెంట్లు భూమిని పార్టీ ఆఫీస్‌ పేరుతో టీడీపీ నాయకులు ఆక్రమిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నారన్నారని ప్రశ్నించారు. పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ ఎడమగట్టు పక్కన ఆక్రమించారని తెలియగానే బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు, నెలరోజుల నుంచి కుడి గట్టు బఫర్‌జోన్‌ను ఆక్రమించి పది అడుగుల మేర మట్టి తోలకం చేస్తుంటే ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి పది అడుగుల దూరంలో ప్రభుత్వస్థలాలు ఆక్రమణలు చేస్తే కనిపించడం లేదా అని నిలదీశారు. ముప్పాళ్లలో నివాసాల పక్కనే ఉన్న చెరువులో పదిహేను అడుగుల మేర లోతు తవ్వి మట్టిని తరలించారన్నారు. ఈ గుంతలు ప్రమాదకరంగా మారినా పట్టించుకోక పోగా, చెరువు స్థలాన్ని సైతం రోడ్డు నిర్మాణం పేరుతో ఆక్రమించడం దుర్మార్గమన్నారు. మండలంలోని తొండపి, బొల్లవరం చెరువుల్లో ఇదే రీతిలో మట్టిని అమ్ముకుంటూ వాటాలు పంచుకుంటున్నారన్నారు. కనీసం అధికారులెవరూ ఈ తవ్వకాలపై పట్టించుకోకపోవటం దారుణమన్నారు. పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌పై టీడీపీ నాయకులు ఆక్రమించిన స్థలాలను వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ముప్పాళ్లలోని చెరువు ఆక్రమణలను పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యల తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్‌ బాలవెంకటేష్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు ఇందూరి నరసింహారెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నక్కా శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఎంజేఎం రామలింగారెడ్డి, లీగల్‌సెల్‌ నాయకులు మణిరావు, పార్టీ నాయకులు వనమాల బ్రహ్మారెడ్డి, యనమాల సింగయ్య, ఎస్సీ సెల్‌ నాయకులు చావా రమేష్‌,యువజన విభాగం అధ్యక్షుడు సుబాని, నియోజక విభాగం అధ్యక్షుడు కిరణ్‌, చయికం వెంకటప్పారెడ్డి, షుకూర్‌, మస్తాన్‌వలి, కానాల పుల్లారెడ్డి, కిక్కురు రామిరెడ్డి, వీరారెడ్డి, పాలడుగు అప్పయ్య, కనుమూరి బాబు, మాజీ సర్పంచ్‌ మధిర రామకృష్ణారెడ్డి, కారుమూరి కృష్ణారెడ్డి, వీరారెడ్డి, శివరామిరెడ్డి, యర్రం పున్నారెడ్డి, శివారెడ్డి, కాటయ్య, జానీబాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement