ముప్పాళ్ల: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని వైద్య పరీక్షలకు హైదరాబాద్ తీసుకెళ్లాడు కొడుకు. కొంచెం నయం కావటంతో తండ్రీకొడుకులు ఇంటికి బయలుదేరారు. నల్గొండ జిల్లా రామన్నగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొంకావారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తోమాసయ్య(59) అనారోగ్యం బారిన పడ్డాడు. వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడు ప్రకాశరావు(35) హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడే పది రోజులపాటు ఉన్నాడు. ఆరోగ్యం మెరుగుపడటంతో తండ్రీకొడుకులు గురువారం రాత్రి బాడుగకు కారు మాట్లాడుకొని ఇంటికి బయలుదేరారు. మార్గంమధ్యలో మేరీమాత వద్దకు వెళ్లి వచ్చేందుకుగాను నాగార్జునసాగర్ వైపు వస్తుండగా పెద్దాపూర మండలం రామన్నగూడెం తండా శివారులో రాంగ్‌రూట్‌లో వస్తున్న మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోమాసయ్య, ప్రకాశరావులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తోమాసయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
గ్రామంలో విషాదఛాయలు
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తోమాసయ్యకు ఇద్దరు కుమారులు. ప్రకాశరావు పెద్దవాడు. తోమాసయ్య మృతి వార్త తెలియగానే భార్య బెర్నలూర్థమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మరో రెండు గంటల్లో ఇంటికి వస్తారనుకుంటుండగా మరణవార్త తెలియటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాశరావు హైదరాబాద్‌లో ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను పట్టుకొని ప్రకాశరావు భార్య లిఖిత రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.
కొంకావారిపాలెంలో విషాదం


