నరసరావుపేట: ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ రీ ఎగ్జామ్ అత్యంత పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని పోలీస్, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, విద్యుత్ , విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు పరీక్ష కేంద్రాల ద్వారా 1,323 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆయా కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదని అన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. అభ్యర్థుల మార్గనిర్దేశం కోసం రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలను డీఆర్‌ఓ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు పూర్తి సహకారం అందించాలని డీఆర్‌ఓ కోరారు.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 516.50 అడుగులకు చేరింది. ఇది 142.9715 టీఎంసీలకు సమానం.


