ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన మండలంలోని వేములూరిపాడు గ్రామ శివారులో మల్కాచెరువు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన ఉమ్మడిదల కోటేశ్వరరావు(65), పద్మావతి(60)లు విజయవాడలోని పెనుమలూరులో కుమారుడివద్ద ఉంటున్నారు. కాగా గుంటూరులోని కుమార్తెను చూసి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం దేచవరం వెళుతుండగా మండలంలోని మల్కాచెరువు వద్ద గుంటూరు నుంచి వస్తున్న లారీ వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాడికొండ: రాజధాని అమరావతిలో లింగాయపాలెం – ఉద్ధండరాయునిపాలెం గ్రామాల మధ్య ఎన్ – 10 సీడ్‌యాక్సెస్‌రోడ్డు (ఈ–03) కూడలిలో అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 34 ప్రధాన రహదార్లకు ఇరువైపులా సుమారు 700 కి.మి. మేర చెట్లు పెంచి మంచి గాలి, నీడ అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఈ సెంట్రల్ నర్సరీలో 45 వేల మొక్కలను పెంచాలని ఏడీసీ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వెల్లడించారు. బుధవారం ఆమె సెంట్రల్ నర్సరీలో మొక్కలు నాటి నర్సరీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 18 ఎకరాలలో ఈ నర్సరీని అభివృద్ధి చేస్తారు. ఫేజ్ – 1లో తొలుత 10 ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టారు. దఫాల వారీగా తక్కిన విస్తీర్ణంలో కూడా నర్సరీని తీర్చిదిద్దుతారు. ఏడీసీ ఉద్యనవన, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


