పెదకాకాని: విద్యుత్ షాక్‌కు గురైన బాలుడు మరణించిన సంఘటన పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి రత్నాల చెరువు చెందిన క్రోసూరి రవికిరణ్(17) గత కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్‌లోని షెడ్‌లో లారీలకు బాడీలు అమర్చే పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు మంగళగిరి నుంచి గుంటూరు ఆటోనగర్ వచ్చి పనులు చేసుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఎప్పటి మాదిరిగానే మంగళవారం లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ షాక్ గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రవికిరణ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ నుంచి మంగళగిరికి కనకదుర్గ వారధి మీదుగా వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని కారు బుగ్గిపాలైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన టి.వందనంరాజు కారులో నగరానికి వచ్చి మంగళవారం రాత్రి తిరిగి వెళ్తుండగా వారధిపై ఏడో నంబర్ పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో నుంచి దట్టమైన పొగరావడం గమనించాడు. వెంటనే అతను అప్రమత్తమై కారును ఆపి బయటకు దిగిపోయాడు. చూస్తుండగానే ఒక్కసారిగా కారంతా మంటలు వ్యాపించాయి. ప్రయాణ సమయంలో కారులో ఒక్కరే ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటనతో వారధిపై ట్రాఫిక్‌జామైంది.


