ఇప్పుడిస్తామన్న ధర కంటే రెండున్నర రెట్లు అధికంగా ఇస్తాం అదీ తక్కువ అనిపిస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి రైల్వే లైను విస్తరణతో భూములు కోల్పోతున్న రైతులతో సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ
రాజుపాలెం: రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, సకాలంలో నష్ట పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో రైల్వే ట్రాక్ వలన భూములు కోల్పోయే రైతులకు అవార్డు ప్రకటించే ముందుగా మంగళవారం రైతుల అభిప్రాయాలను సేకరించారు. మండలంలో అనుపాలెం, చౌటపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాలకు సంభందించిన 249 మంది రైతులకు సంబంధించిన సుమారు 20 ఎకరాల సాగు భూములను రైల్వే అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి అవార్డు ప్రకటించే ముందుగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. కొంతమంది రైతులు ఆర్డీఓతో మాట్లాడుతూ ఇప్పుడు బయట మార్కెట్ రేటు ఎకరం రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుందని ప్రభుత్వం చాలా తక్కువ నష్ట పరిహారం ఇస్తుందని వాపోయారు. దీంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రేటుతో కలిపి రెండున్నర రెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మీ పొలాల్లో ఉన్న బోర్లకు, బావులకు పెద్ద చెట్లకు అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇది సమంజసం కాదనిపిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తహసీల్దార్ దుర్గేశ్వరరావు, ఆర్‌ఐ గోపి, వీఆర్వోలు పుల్లయ్య, దుర్గాభాయి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.


