కాపర్‌ కేబుల్స్‌ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కాపర్‌ కేబుల్స్‌ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో కాపర్‌ కేబుల్స్‌ అపహరించిన వ్యక్తిని తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు మంగళవారం అరెస్ట్‌ చేశారు. మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ యూనివర్సిటీలో లక్షల రూపాయల విలువ చేసే కాపర్‌ కేబుల్స్‌ దొంగతనానికి పాల్పడిన మానిగల మంగయ్యను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 30 కేజీల కాపర్‌కేబుల్స్‌, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మంగయ్య పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ సమావేశంలో తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

యువతిపై లైంగికదాడికి యత్నం

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

తెనాలిరూరల్‌: యువతిపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటనలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విశ్వసనీయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చినరావూరుకు చెందిన యువతి ఇక్కడి వహాబ్‌ చౌక్‌లోని సోలార్‌ సిస్టమ్‌ షాపులో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తోంది. ఇదే షాపులో మేనేజర్‌గా పనిచేసే రాజేష్‌ నెల రోజులుగా యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. గాంధీచౌక్‌లోని షాపు గోడౌన్‌కు సోమవారం మధ్యాహ్నం పిలిచాడు. యువతి రాగానే తలుపు వేసి లైంగికదాడికి యత్నించాడు. యువతి తప్పించుకుని వెళ్లింది. విషయం యువతి బంధువులకు తెలియడంతో సుమారు 20 మంది రాజేష్‌కు దేహశుద్ధి చేసేందుకు మంగళవారం ఉదయం సోలార్‌ షాపు వద్దకు వెళ్లారు. సమాచారం అందుకున్న వన్‌ టౌన్‌ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు.

ఐదు ఇసుక టిప్పర్లు సీజ్‌

కొల్లిపర: ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్‌లను స్వాధీనం చేసుకుని మంగళవారం కేసు నమోదు చేసినట్లు కొల్లిపర ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. చిలుమూరు లంక నుంచి గుంటూరుకి ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మండల పరిధిలోని తూములూరు అడ్డ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఐదు టిప్పర్లను ఆపి పరిశీలించగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు, వే బిల్లు లేకపోవడంతో సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ జి సిద్ధార్థకు నివేదిక సమర్పించారు. ఒక్కొక్క టిప్పర్‌కి రూ.10,000 చొప్పున మొత్తం రూ.50,000 జరిమానా విధించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఎటువంటి బిల్లులు, మైనింగ్‌ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement