ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

చిలకలూరిపేట: నిరుద్యోగులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా చెప్పారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మంగళవారం మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. జాబ్‌మేళాను జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండేళ్లలో నియోజకవర్గ పరిధిలో 1500 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయని, ఇందులో 600 మంది ఉద్యోగాల్లో చేరారని వివరించారు. ఈ రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా 6,500 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. వచ్చే నెలలో దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగంతోనే జీవితానికి గుర్తింపు, విలువ, సమాజంలో గౌరవం లభిస్తాయని చెప్పారు. జాబ్‌మేళాకు 50 కంపెనీలు వచ్చినట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఇ.తమ్మాజీరావు తెలిపారు. దీనికి సంబంధించి ఉద్యోగాల కోసం 2,152 మంది హాజరుకాగా, దీనిలో 826 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి భరద్వాజ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా అదనపు అధికారి వీసీహెచ్‌ రామాంజనేయులు, ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్రనాయక్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement