ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
13 వాహనాలు స్వాధీనం
నకరికల్లు : వాహన దొంగలను అరెస్ట్ చేసి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కె.సతీష్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నకరికల్లులోని సినిమాహాలు వీఽధిలో ద్విచక్రవాహనం చోరీ జరిగిందని వచ్చిన ఫిర్యా దు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో ఇద్దరు మైనర్‌లతో పాటు నరసరావుపేటకు చెందిన ఉద య్, గోపిలను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి 13 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు.
పేకాట స్థావరంపై దాడి
16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పిడుగురాళ్ల: పేకాట ఆడుతున్న స్థావరంపై పిడుగురాళ్ల పట్టణ పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్‌గేట్ సమీపంలో ఉన్న హోటల్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పిడుగురాళ్ల పట్టణ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు పేకాట రాయుళ్లు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. దీంతో పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్‌లు ఒక్కసారిగా దాడులు నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,40,190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హోటల్ కేంద్రంగా నిర్వాహకులే పేకాట ఆడిస్తున్నట్లు కొంత మేరకు సమాచారం ఉందని, ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏఎన్‌యూ లైబ్రరీకి
వేటూరి పుస్తకాలు బహూకరణ
ఏఎన్‌యూ(పెదకాకాని): సినీ సినీయేతర సాహిత్య రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్య పుస్తకాలను ఆయన కుమారులు శనివారం వర్సిటీలోని గ్రంథాలయానికి బహూకరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన వేటూరి సుందర రామమూర్తి రచించిన సాహిత్య పుస్తకాలు దొరకునా ఇటువంటి సేవ, మానసవీణ మధుగీతం, నవమి నాటి వెన్నెల, ఎడారిలో కోయిల, ఝుమ్మంది నాదం, ఎరక్కపోయి వచ్చాను వంటి పుస్తకాలను వేటూరి కుమారులు వేటూరి రవి ప్రకాష్, వేటూరి చంద్రశేఖరరావులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీకి స్వయంగా విచ్చేసి బహూకరించారు. గ్రంథాలయ అధికారి ప్రొఫెసర్ కోడెల వెంకట్రావు నేటి యువతకు ఈ సాహిత్య పుస్తకాలు, సాహిత్య పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.


