ఒడిశా కార్మికుడి బలవన్మరణం
నాదెండ్ల: ఒడిశా కార్మికుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశాకు చెందిన కార్మికుడు రణబిడఅరుణ్ (36) నాలుగు నెలలుగా స్థానిక ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 28న తనకు ఆరోగ్యం బాగాలేదని, మీరు ఇక్కడకు వచ్చి తనను తీసుకెళ్ళాలని ఫోన్‌లో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేరోజు తాను ఒడిశాకు వెళ్తున్నట్లు కంపెనీ అధికారులకు తెలియపరిచి బయటకు వచ్చాడు. గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న పాత గోల్డెన్ టుబాకో కంపెనీలోకి వెళ్లి ఐరన్‌రాడ్‌కు వైరుతో ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున 5.30 గంటలకు కంపెనీ వాచ్‌మెన్ నాగరాజు విద్యుత్ లైట్లు ఆపేందుకు వెళ్ళగా మృతదేహాన్ని చూసి కంపెనీ యాజమాన్యానికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


