మహిళ ముక్కు కోసిన ఇద్దరు అరెస్టు
పిడుగురాళ్ల: కోడి కత్తితో మహిళ ముక్కు కోసి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని లెనిన్ నగర్‌లో ఈ నెల 22వ తేదీన మహిళ ముక్కు కోసి పరారైన వ్యక్తులను పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు తన సిబ్బందితో పట్టుకున్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన కంపా వెంకట్రావుకు చెరుకూరి మరియమ్మతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల మనస్పర్థలు ఏర్పడి నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారు. మరియమ్మను చంపేందుకు బంధువైన కంపా నగేష్‌తో కలిసి వెంకట్రావు కోడికత్తి తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. మరియమ్మను నగేష్ రెండు చేతులు వెనక్కి పట్టుకోగా గొంతుపై కత్తితో కోసేందుకు వెంకట్రావు ప్రయత్నించాడు. తోపులాటలో మరియమ్మ ముక్కు తెగింది. దీంతో వారు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ శివనాగరాజు, మోహన్, సిబ్బంది ఉన్నారు.


