మట్టిలో మాణిక్యం సుకేష్
గ్రూప్–2లో మెరిసిన తంగెళ్లమూడి కుర్రోడు తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కానిస్టేబుల్ ట్రైనింగ్‌లో ఉండగా డీటీ ఉద్యోగ శుభవార్త
పెదకాకాని: తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం. తోడబుట్టిన వాడు పెయింటర్. ఉన్నత ఆశయం, పట్టుదల, నిరంతర కృషితో 43 రోజుల కిందట కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ట్రైనింగ్‌లో ఉండగానే ఈనెల 28న ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో ఉత్తీర్ణత డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం సాధించాడు. పెదకాకాని మండలం తంగెళ్లమూడికి చెందిన బద్దెపూడి సుకేష్. గ్రామంలోనే మొట్టమొదట గ్రూపు–2 ఉద్యోగం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
రెండు నెలల వ్యవధిలో రెండు ఉద్యోగాలు..
మండలంలోని తంగెళ్లమూడి గ్రామానికి చెందిన బద్దెపూడి మోషే, సునీత దంపతులకు ఇద్దరు సంతానం. మోషే వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా తల్లి సునీత స్థానిక నర్సరీలో కూలి పనులకు వెళుతుంది. వారిలో పెద్దవాడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రెండవ సంతానం సుకేష్ బీఎస్సీ పూర్తి చేసి కాకినాడలో మూడేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. 2025 డిసెంబరు 16వ తేదీన కానిస్టేబుల్‌గా అపాయింట్‌మెంట్ తీసుకుని 21వ తేదీన ట్రైనింగ్ నిమిత్తం తిరుపతి వెళ్లాడు. ఈనెల 28వ తేదీన విడుదలైన గ్రూపు–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వరించింది. తంగెళ్ళమూడి గ్రామంలోనే మొట్ట మొదటిసారిగా సుకేష్ గ్రూపు 2 ఉద్యోగం రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రజలు ఆనందంలో ఉన్నారు. ఈ సందర్భంగా సుకేష్ మాట్లాడుతూ ఈ విజయం తన తల్లిదండ్రులు, అన్నయ్య, మామయ్యలకు అంకితమన్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మట్టిలో మాణిక్యం సుకేష్


