‘ఉపాధి’ పనుల్లో అవినీతిపై జనాగ్రహం
నకరికల్లులో రూ.1.13 కోట్లతో
267 పనులు
ఉపాధి పనుల చెల్లింపులపై ఉపాధి కూలీల ఆగ్రహం
బినామీ మస్టర్‌లు, క్షేత్రస్థాయిలో పనులు లేకుండానే ఉన్నట్లు బిల్లులు
పూర్తికాని ఇళ్లకు 90 రోజుల పని దినాల పేరిట 165 పేర్లతో బిల్లుల మంజూరు
పంటకాలువల పూడికతీత పేరిట రూ.40 లక్షల బిల్లులు
విదేశీ విద్యార్థులకు పనులు కల్పించినట్లు గుర్తింపు
నకరికల్లు: ఉపాధి హామీ పథకంలో చేయకుండా చేసినట్లు రికార్డులు సృష్టించి లక్షలాది రూపాయలు బిల్లులు చేసుకున్నారని పలువురు ఉపాధి కూలీలు ఆరోపించారు. గతేడాది పనులపై సామాజిక తనిఖీ అనంతరం బుధవారం నకరికల్లులో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలతో ఉపాధి కూలీలు విస్తుపోయారు. ఏడాది కాలంలో 267 పనులకు వేతనాల రూపంలో రూ.61,60 లక్షలు, మెటీరియల్ రూపంలో రూ.51.92 లక్షలు మొత్తం రూ.1.13 కోట్లు ఖర్చు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
పూర్తి కాని ఇళ్లకు..
ప్రధానంగా పూర్తికాని ఇళ్లకు 90 రోజుల పనిదినాలు చూపుతూ బినామీ మస్టర్‌లతో 165 మంది పేరిట బిల్లుల మంజూరు చేసినట్లు, క్షేత్రస్థాయిలో చేపట్టని పనులకు రికార్డుల్లో నమోదు చేసి బిల్లులు మంజూరు చేసినట్లు, కాలువల్లో పూడికతీత పేరిట సంబంధిత ఫొటోలు కూడా లేకుండా రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేసినట్లు వెల్లడి కావడంతో ఉపాధికూలీలు మండిపడ్డారు.
విదేశాల్లో ఉంటున్న విద్యార్థుల పేరిట..
ఫిలిఫైన్ దేశంలో, ఇతర రాష్ట్రంలో మెడిసిన్ విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు, కిరాణా దుకాణదారులు, ఇతర జిల్లాల్లో ఉన్నవారి పేరిట, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి పని కల్పించినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీఆర్‌పీ రవి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు నమోదు చేసుకొని ప్రజావేదికలో వెల్లడిస్తామన్నారు. ఈ నేపఽథ్యంలో ఈనెల 30న జరగునున్న ప్రజావేదిక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా జిల్లా అధికారులు ఇప్పటికే నకరికల్లు మండలంలో జరిగిన ఉపాధి పనుల తీరుపై ప్రత్యేక నిఘాతో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రామసభలో పీడీఓ కొమ్మవరపు అప్పారావు, సర్పంచి పరసా అంజమ్మ, ఏపీఓ ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు తిరుమలశెట్టి వెంకట్రావు పాల్గొన్నారు.


