మందా సాల్మన్‌ది రాజకీయ హత్యే
పిడుగురాళ్ల: మందా సాల్మన్‌ది రాజకీయ హత్యనేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మందా సాల్మన్ కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ, నాయకులు పరామర్శించారు. హత్య వివరాలు, సంఘటనకు సంబంధించిన వాస్తవాలు, కుటుంబ సభ్యులను అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం సాల్మన్ కుటుంబాన్ని ఆర్థికంగా అదుకోవాలని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వోద్యోగం ఇచ్చి, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. హత్య జరుగుతుందని ముందుగా తెలిసినా నిర్లక్ష్యంగా వహించిన సంబంధిత సీఐ, ఎస్‌ఐలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని సహాయ, సహకారాలు అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరగే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు.
కలెక్టర్, ఎస్పీని కలిసిన నేతలు..
సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగా సంజయ్ మాదిగ కలిశారు. సాల్మన్ హత్య అనంతరం కొందరు వారి ఇంటిపైకి రాళ్లు విసురుతూ, దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందివుడుగుల టీఎం రమేష్ మాదిగ, ఎమ్మార్పీస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంగి సుధాకర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిద్దయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా శ్రీనివాసులు, కోనసీమ జిల్లా సోషల్ మీడియా కన్వినర్ శీలి దశరధ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ


