కృష్ణానదిలో రసాయనాలు కలవలేదు
దాచేపల్లి: కృష్ణానదిలో రసాయనాలు, విష పదార్థాలు కలవలేదని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారిణి షేక్ నజీరాబేగం పేర్కొన్నారు. మండలంలోని తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణానదిలోని నీళ్లను బుధవారం పరిశీలన చేశారు. నదిలో రసాయనాలు, విష పదార్థాలు కలవటం వలన నీళ్లు రంగుమారాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో నజీరాబేగం నదిలోని నీటిని పరిశీలన చేసి నీటి నమూనాలు సేకరించారు. ఈ సందర్భం మీడియాతో మాట్లాడారు.. కృష్ణానదిలో నీటి నమూనాలు సేకరించి గత 20 రోజుల క్రితం జోనల్ ల్యాబ్‌రేటరీ, హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపించామని, ల్యాబ్‌లలో పరీక్షలు చేసిన తరువాత నీటిలో రసాయనాలు, విష పదార్ధాలు కలవలేదని తేలిందని చెప్పారు. నదిలో గుర్రపు డెక్క, నాచు ఎక్కువగా పెరగటం వలన సహజసిద్ధంగా నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారినట్లుగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారన్నారు. ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగునీరు ఎక్కువగా నదిలో కలవటం వలన కూడా నీళ్లు రంగుమారతాయని, గ్రామ పంచాయతీగా ఉన్న తంగెడలో ఎక్కువమొత్తంలో మురుగు వచ్చే అవకాశం లేదన్నారు. తంగెడకు సమీపంలోని వాడపల్లి వద్ద మూసినది నుంచి ఎక్కువగా మురికినీరు వస్తుందనే అంశంపై పరిశీలన చేస్తున్నామన్నారు. కృష్ణానదిలోని నీటిని ఫిల్టర్ చేసిన తరువాతనే ఉపయోగించాలని ఆమె సూచించారు. మరోసారి కృష్ణానదిలో నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కి పంపించి పరీక్షలు చేయిస్తామని, ప్రజలు ఆందోళన చెందకుండా సురక్షితమైన పద్ధతుల్లో నీటిని వినియోగించాలని రీజనల్ అధికారిణి నజీరాబేగం చెప్పారు. ఈ పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి గుండ్రెడ్డి కోటేశ్వరరావు, షేక్ హస్సన్ అహ్మాద్, జానపాటి సీతారామశర్మ తదితరులున్నారు.
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి
రీజినల్ అధికారి షేక్ నజీరాబేగం


