పొట్ట చేతపట్టుకుని..! | - | Sakshi
Sakshi News home page

పొట్ట చేతపట్టుకుని..!

Jan 28 2026 7:13 AM | Updated on Jan 28 2026 7:13 AM

పొట్ట చేతపట్టుకుని..!

పొట్ట చేతపట్టుకుని..!

● రాజధాని ప్రాంతంలో పనులు లేక వలసలు ● జనవరిలోనే కరవు చాయలు ● పనుల కోసం కోనసీమ వైపు పరుగులు పెడుతున్న పెదకూరపాడు పల్లెల కూలీలు

పెదకూరపాడు : చేతినిండా పని లేదు..... పూట గడవడం లేదు... పిల్లలను సాకడం ఎలా.....నెల నెలా తీసుకున్న అప్పులు కట్టేది ఎలా.. బతుకు బండిని నడిపించేది ఎలా... దూరమైనా పని దొరికిన కాడకే పోదామంటూ పల్లె జనం వలస బాట పట్టారు. రాజధాని ప్రాంతంగా చెప్పుకునే పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామాలలోని ప్రజలు వ్యవసాయ పనులు లేక పొట్టకూటి కోసం కోనసీమ వైపు పరుగులు పెడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్లు, వందల సంఖ్యలో కుటుంబాలు వలస వెళుతున్నాయి... ఫలితంగా పల్లెలు బోసి పోతున్నాయి. పలు గ్రామాల్లో ఏ ఇల్లు చూసినా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా దర్శనమిస్తున్నారు. ఉపాధి లేకపోవటం, ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు లేకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ముంచేసిన పత్తి పంట...

పెదకూరపాడు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వాణిజ్య పంటలైన పత్తి, మిరప ఎక్కువ సాగు చేస్తుంటారు. ఆరు నెలలు మాత్రమే ఖరీఫ్‌ పంటలు సాగు చేస్తుంటారు. ఎక్కువగా వ్యవసాయ పనులు జులై నుంచి మార్చి వరకు ఉంటాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి దిగుబడులు లేక నవంబర్‌ నెలలోనే రైతులు దున్నేశారు. మిరప పంట ఫిబ్రవరి నెలాఖరు నుంచి దిగుబడులు వస్తాయి. ఈ ప్రాంత వ్యవసాయ కూలీలు నవంబర్‌ నెల నుంచి వ్యవసాయ పనులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే వలస బాట పట్టారు.

ఉపాధి పనులు కొందరికే...

నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి పనులు జరుగుతున్నా కొందరికి మాత్రమే ఉపాధి సిబ్బంది పనులు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే పిలిచి పనులిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంగా గొప్పలు చెప్పుకుంటున్న పెదకూరపాడు నియోజకవర్గంలో వ్యవసాయ కూలీలకు, సన్న, చిన్న కారు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేదా ఉపాధి భృతి ఇవ్వాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

పాటిబండ్ల గ్రామంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement