అక్రమ కేసులతో నిర్బంధం
నెల్లూరు రూరల్: అక్రమ కేసులతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడ్ని జైల్లో నిర్బంధించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్‌బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్‌రెడ్డి, బ్రహ్మనాయుడు మంగళవారం ములాఖత్ అయ్యా రు. ఆయన మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు, రైతులు ఆరాధించే వ్యక్తి పిన్నెల్లి అని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి అని చెప్పారు. రెడ్‌బుక్‌లో భాగంగా వీరిని అక్రమ కేసు లో జైలుకు పంపారని ఆరోపించారు. మాచర్లలో ఇటీవల రెండు హత్యలు జరిగాయని, వారు గానీ బయట ఉంటే ఆ కేసులను సైతం వీరిపై మోపే వారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కక్షగట్టి తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు.
అరాచకాలు తప్ప.. అభివృద్ధి ఏదీ..?
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో అరాచకాలు అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని, సంబంధం లేని కేసులో పిన్నెల్లి సోదరులను జైలుకు పంపారని వెంకటరెడ్డి ఆరోపించారు. టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడి ఒకర్నొకరు చంపుకొంటే ఆ హత్యను పిన్నెల్లి సోదరులకు ఆపాదించారని చెప్పారు. సంబంధం లేని కేసులో 48 రోజులుగా జైల్లో గడుపుతున్నారని తెలిపారు. అనంతరం అశోక్‌బాబు మాట్లాడారు. ఎలాంటి సంబంధం లేని కేసుల్లో పిన్నెల్లి సోదరులను ఇరికించడం దారుణమన్నారు. ఇలా చేస్తే రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటాననే ఆ పార్టీ శ్రేణులే ఆలోచిస్తున్నారని చెప్పారు.


