ప్రతి నెలా మొదటి గురువారం ‘గ్రామ ఆరోగ్య దర్శిని’
నరసరావుపేట: జిల్లాలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సామాజిక భాగస్వామ్యంతో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా మొదటి గురువారం ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కార్యక్రమ రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో ప్రజారోగ్యం, పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక భాగస్వామ్య ఆరోగ్య నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మొదటి ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ
గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలో గ్రామ ఆరోగ్య దర్శిని కమిటీలు ఏర్పాటు చేస్తారన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్, పేరెంట్స్ కమిటీ ప్రతినిథి, డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి నెల రోజుల కాలంలో అమలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.


