నిఘా నేత్రాలతో భద్రతకు పెద్దపీట
15 నిమిషాల్లోనే అత్యవసర సేవలు సోలార్ కాంతుల్లో ఆరు వరుసల బైపాస్ రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 1,072 కోట్లతో నిర్మాణం బెంగళూరు–విజయవాడ మధ్య నాలుగు గంటల సమయం ఆదా హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్ ఆర్.కె.సింగ్
యడ్లపాడు: జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ రీజినల్ ఆఫీసర్ ఆర్.కె. సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నేతృత్వంలోని అధికారుల బృందం పల్నాడు జిల్లాలో రూ. 1,072 కోట్ల వ్యయంతో నిర్మించిన 16.49 కిలోమీటర్ల చిలకలూరిపేట ఆరు వరుసల బైపాస్ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అమరావతి పీడీ టి. పార్వతీశం, డీజీఎం జగదీష్, జీఎం నీరజ్ గుప్తా, ఏపీడీడీసీఎఫ్ ఎండీ కె. మురళీధర్ తదితర అధికారులు బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ జాతీయ రహదారి – 16 నిర్మాణంలో ఇప్పటికే 5 గిన్నిస్ రికార్డులను సాధించామని గుర్తుచేశారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఈ బైపాస్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. దీనివల్ల బెంగళూరు–విజయవాడ మధ్య సుమారు నాలుగు గంటల సమయం ఆదా అవుతుందని వివరించారు.
అత్యాధునిక సాంకేతిక నిఘా..
రహదారి పొడవునా అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టంలో భాగంగా 19 పీటీజెడ్, 58 సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటితే వెంటనే రెడ్ సిగ్నల్ ద్వారా హెచ్చరికలు జారీ అవుతాయి. కిలోమీటరుకో ఎరుపు టెలిఫోన్ బాక్సు ఉంది. ఫోన్ లేకపోయినా వీటిలోని బటన్ నొక్కితే 15 నిమిషాల్లోనే అంబులెన్సు, క్రేన్ లేదా పెట్రోలింగ్ వాహనం వస్తుంది. భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా రహదారికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. 6 రకాలైన ఐదు వేల మొక్కలను పెంచామని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఉంటే 1033కు కాల్ చేయాలని కోరారు. విజయవాడ మినీ వెస్ట్ హైవే ప్రారంభం నుంచి చైన్నె మార్గంలోకి ప్రవేశించే వరకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కాజ టోల్‌ప్లాజా వద్ద ఫుడ్ కోర్టులు, బాలింతలు పాలిచ్చేందుకు ప్రత్యేక గది, పిల్లలకు ఆట స్థలాలు వంటి వసతులు ఏర్పాటు చేశామన్నారు.


