రేపటి నుంచి జాతీయస్థాయి గిత్తల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి రెండున నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. పోటీల పోస్టర్లను శనివారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ కానుకమాత చర్చి తిరునాళ్ల సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా రైతు సోదరులను ఉత్సహపరిచేందుకు ఈ జాతీయ స్థాయి గిత్తల ప్రదర్శన పోటీలను స్థానిక సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో తొమ్మిది బహుమతుల చొప్పున మొత్తం 72 మంది విజేతలైన రైతు సోదరులకు మొత్తం రూ. 26 లక్షల నగదుతోపాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క గిత్తల యజమానులకు ప్రోత్సహక బహుమతులను అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ గొంటు సుమంత్‌రెడ్డి, మాజీ పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడపాటి రామకృష్ణ, ఏరువ జోజిరెడ్డి, కొమ్మారెడ్డి జోసఫ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


