కాలమిస్ట్ వెనిగళ్ల వెంకటరత్నం మృతి
తెనాలి: తెనాలి ప్రాంతానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు, కాలమిస్ట్ వెనిగళ్ల వెంకటరత్నం (88) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మృతి చెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరత్నం స్వస్థలం తెనాలి సమీపంలోని అమృతలూరు మండల గ్రామం గోవాడ. హైస్కూలులో చదివేరోజుల్లోనే సాహిత్యంపై అనురక్తి ఏర్పడింది. తెనాలిలో డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్ వెళ్లారు. కోరమండల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగంలో చేరారు. 1972లో రసరంజని పేరుతో నాటక సంస్థను ఏర్పాటుచేసి నాటకాలు ఆడారు. 1982 నుంచి ప్రీలాన్స్ జర్నలిస్టుగా, కాలమిస్ట్‌గా పదేళ్లపాటు పత్రికలకు వ్యాసాలు రాశారు. హరిత విప్లవకారుడు నార్మన్ బోర్లాగ్‌పై వ్యాసం ప్రముఖమైంది. రసరేఖ పేరుతో హైదరాబాద్‌లో ఆయన నిర్వహించిన మూడురోజుల కార్యక్రమాలు బాగా గుర్తింపు పొందాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ఉధృతంగా జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ‘సారా పోరు’ బుక్‌లెట్‌ను ప్రచురించారు. ‘ఆంధ్రాప్యారిస్ తెనాలి’ పుస్తకాన్నీ తీసుకొచ్చారు. తాను పనిచేస్తున్న కంపెనీలో మేనేజరుగా రిటైరైన వెంకటరత్నం విశ్రాంత జీవితాన్ని హైదరాబాద్‌లోనే గడిపారు.


