భక్తుల డిమాండ్లపై స్పందన శూన్యం
త్రికోటేశ్వరుడి సేవలో డిప్యూటీ సీఎం వినతులతో వచ్చిన వారిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపించని పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు
సాక్షి, నరసరావుపేట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుడి దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన భక్తులకు నిరాశ మిగిల్చింది. తొలిసారి ఇక్కడికి వచ్చినందున ఆయన చూస్తున్న అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై నిర్ణయం తీసుకుంటారని భావించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చిన పవన్.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కోటప్పకొండకు చేరుకున్నారు. తొలుత కొండపై స్వామివారి దర్శనం చేసుకున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలోని వనవిహారి పార్క్ సందర్శించారు. కోటప్పకొండ– కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. చాలా కాలంగా అటవీ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న పాత కోటయ్య మెట్లమార్గం అనుమతుల విషయం పరిష్కారమవుతుందని భావించినా ఫలితం దక్కలేదు. గిరి ప్రదక్షిణ దారి బీటీ రోడ్డు గురించి పవన్ ఆరా తీసినప్పటికి ప్రకటన చేయకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. వినతిపత్రాలు ఇవ్వడానికి దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చినా వారికి అవకాశం దక్కలేదు. కారులో నుంచి అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. కోటప్పకొండ నుంచి తిరుగు ప్రయాణంలో గుంటూరుకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.
ప్రజాప్రతినిధులు గైర్హాజరు
పవన్ పర్యటనకు స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర జిల్లా అధికారులు, కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు. జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకాకపోవడంపై చర్చ జరిగింది. పంచాయతీరాజ్ అధికారులు వేసిన ఫ్లెక్సీలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవి ఫొటో లేదంటూ కొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.


