కాల్వలో పడి సాంఘిక నాటక దర్శకుడు మృతి
దుర్గి/గురజాల: మండల పరిధిలోని అడిగొప్పల గ్రామానికి చెందిన ఆరికట్ల వెంకట్రామయ్య అలియాస్ ఏవీఆర్ చౌదరి (50) ప్రమాదవశాత్తూ కాలువలోపడి దుర్మరణం చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. వెంకట్రామయ్య తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పక్కనే ఉన్న కాల్వలోకి దిగాడు. కాల్వలో పాచి ఎక్కువగా ఉండటంతో కాలుజారి నీటి ప్రవాహంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన ప్రముఖ సాంఘిక నాటక దర్శకుడుగా పల్నాటి ప్రాంతంలో ప్రాచుర్యం పొందాడు. వందలాది సాంఘిక నాటకాలకు దర్శకత్వం వహించి కొత్తతరం యువకులను, నటనా రంగానికి పరిచయం చేశాడు. కొంతకాలం ప్రముఖ దినపత్రికలలో జర్నలిస్టుగా సేవలందించాడు. విషయం తెలుసుకున్న నాటకరంగ కళాకారులు, అభిమానులు వెంకట్రామయ్య మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


