డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి
నాదెండ్ల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు చోటు చేసుకోవటంలో సుమారు రూ.28 లక్షల రికవరీ ఆదేశించినట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి చెప్పారు. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు సుమారు రూ.9 కోట్ల విలువైన పనులు జరిగాయి. గణపవరం గ్రామం చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైనందున పనులు జరగలేదు. మిగిలిన గ్రామాల్లో జరిగిన పనుల్లో లోపాలను గుర్తించి శనివారి రికవరీ వివరాలు వెల్లడించారు. అమీన్‌సాహెబ్‌పాలెంలో జరిగిన పనుల్లో రూ.2,15,044, సాతులూరులో రూ.5,43,520, జంగాలపల్లెలో రూ.1,23,730, కనపర్రులో రూ.2,41,933, గొరిజవోలులో రూ.1,05,704, అప్పాపురంలో రూ.77,365, నాదెండ్లలో రూ.5,04,553, చిరుమామిళ్లలో రూ.1,61,213, చందవరంలో రూ.80,720, బుక్కాపురంలో రూ.55,840, ఇర్లపాడులో రూ.2,84,959, సంకురాత్రిపాడులో రూ.1,52,315, ఎండుగుంపాలెంలో రూ.1,28,921, తూబాడులో రూ.91,488లు వెరశి రూ.27,67,300లు సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి హీరాలాల్ నాయక్, క్వాలిటీ కంట్రోలర్ ప్రభాకరరావు, విజిలెన్స్ ఏపీఓ విజయకుమారి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.


