దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
కారెంపూడి: ఇటీవల మండలంలోని నరమాలపాడు గ్రామ శివారులో జరిగిన భారీ దారి దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కారెంపూడి సీఐ శరత్‌బాబు, ఎస్‌ఐ వాసు గురువారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. మాచర్ల నుంచి కపలవాయి నాగ సాంబశివరావు ఆదేశాల మేరకు అతని గుమస్తా కోటేశ్వరరావు అతని కుమారుడు అనిమిశెట్టి సాయి వెంకటేష్, తిరుమల వాసులు కారులో 13 కిలోల వెండి, రూ.30 లక్షల నగదుతో కారెంపూడి మీదగా పిడుగురాళ్ల చేర్చేందుకు బయలు దేరారు. మార్గ మధ్యలో వారు నరమాలపాడు శివారులో భోజనం చేసేందుకు కారును పక్కన ఆపారని ఆ సమయంలో బైక్‌లపై వచ్చిన దొంగలు కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న వెండి, నగదును అపహరించారని అధికారులు వివరించారు. బాధితుడు నాగ సాంబశివరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి పిడుగురాళ్లలో నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. కేసులో బొమ్మినేడి శ్రీనివాసరావు, అనుములశెట్టి సాయి వెంకటేష్, కందుకూరి నాని, పెళ్లూరి ఆంజనేయులు, మోగిలి అఖిల్‌లను అరెస్టు చేయడం జరిగిందని సీఐ, ఎస్‌లు వివరించారు. వారు వాడిన మూడు బైక్‌లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.


