సానుకూల పవనాలు వీచేనా !
నేడు కోటప్పకొండలో ఉపముఖ్యమంత్రి పర్యటన
నరసరావుపేట రూరల్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో పర్యటించనున్నారు. త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రూ.3.9కోట్లతో నిర్మించిన కొత్తపాలెం– కోటప్పకొండ రోడ్డును ప్రారంబిస్తారు. ఘాట్‌రోడ్డులోని ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. కోటప్పకొండ అభివృద్ధిలో భాగంగా పలు పనులు అటవీశాఖ అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాయి. పాతకోటయ్య స్వామి మెట్లమార్గం, గిరిప్రదక్షిణ దారి ఇందులో ఉన్నాయి. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న అటవీశాఖ వద్ద ఈ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
అటవీశాఖ అనుమతులు కోసం ఎదురుచూపులు
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి పైభాగాన ఉన్న పాతకోటయ్య స్వామి ఆలయానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాతకోటయ్య ఆలయానికి మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని భావించారు. విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంబం కాలేదు. మెట్లమార్గం ఏర్పాటుకు అవసరమైన ఫైల్ ప్రస్తుతం అటవీ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. రెండేళ్లుగా ఈ ఫైల్ ముందుకు సాగడం లేదు.
గిరిప్రదక్షిణ దారికి మోక్షం ఎప్పుడూ..?
కోటప్పకొండ గిరిప్రదక్షిణను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. మట్టి, రాళ్లతో నిండిన రోడ్డుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 7 కిలో మీటర్ల గిరి ప్రదక్షిణదారిలో సగానికి పైగా ఇప్పటికే బీటీ రోడ్డు ఉంది. మిగిలిన దారిలో బీటీ రోడ్డు వేసేందుకు అటవీ శాఖ అనుమతులు కావాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైన డీపీఆర్‌ను అధికారులు పంపించారు. పవన్ కల్యాణ్ కోటప్పకొండ పర్యటనలో ఈ రోడ్డుకు శంకుస్థాపన ఉంటుందని భావించారు. అయితే చివరి నిమిషంలో దీనిని రద్దు చేశారు. అటవీ శాఖ నుంచి అనుమతులు లేకపోవడమే వల్లనే రద్దు చేసినట్టు సమాచారం.
కళతప్పిన ఘాట్‌రోడ్డు మార్గం..
కోటప్పకొండ ఘాట్‌రోడ్డు మార్గంలోకి ప్రవేశించే భక్తులకు పచ్చని చెట్లు, పూల మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపించేది. ప్రస్తుతం ఘాట్‌రోడ్డు మార్గం కళతప్పింది. ఎండిపోయిన చెట్లు భక్తులకు దర్శనమిస్తున్నాయి. టోల్‌గేట్ వద్ద నుంచి ఘాట్‌రోడ్డులోని పచ్చదనంతో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని అటవీ శాఖ నిర్వహిస్తుంది. కొంతకాలంగా మొక్కల సంరక్షణను ఈ శాఖ గాలికొదిలేసింది. నీరు లేక మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. కాళింది మడుగులో బోట్లు మరమ్మతులకు గురికావడంతో బోటు షికారు నిలిచిపోయింది. బాలానందంలో చిన్నారుల ఆటవస్తువులు దెబ్బతిన్నాయి. పక్షుల పర్ణశాలలోని నెమళ్ల క్లోజ్‌డ్ ఎన్‌క్లోజర్‌కు ఎండవేడిమి తట్టుకునే విధంగా ఏర్పాటుచేసిన గ్రీన్ మేట్‌లు చిరిగిపోయాయి. అటవీ శాఖ అధికారుల అలసత్వంలో ఇక్కడ వన్యప్రాణులు దప్పికతో అల్లాడుతున్నాయి. మూడు నెలల పాటు నీటి మోటర్లు పనిచేయక వన్యప్రాణులు దప్పికతో అల్లాడిపోయిన ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి.
కోటప్పకొండలో నిలిచిన అభివృద్ధి పనులు
పాత కోటయ్య స్వామి మెట్ల మార్గం,
గిరి ప్రదక్షిణ దారికి అటవీ శాఖ అడ్డంకులు
అటవీ శాఖ అనుమతుల కోసం రెండేళ్లుగా ఎదురుచూపులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దే అటవీ శాఖ
సానుకూల పవనాలు వీచేనా !


