పల్లెల్లో టెన్షన్‌..టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో టెన్షన్‌..టెన్షన్‌

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

పల్లె

పల్లెల్లో టెన్షన్‌..టెన్షన్‌

చంద్రబాబు ప్రభుత్వంలో మళ్లీ ఫ్యాక్షన్‌ సంస్కృతి ● వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు ● అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు ● టీడీపీ నేతలకు అండగా ఖాకీలు ● బాధితులపైనే కేసులు నమోదు

చంద్రబాబు ప్రభుత్వంలో మళ్లీ ఫ్యాక్షన్‌ సంస్కృతి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఒకప్పుడు పల్నాడు జిల్లా ఫ్యాక్షన్‌ రాజకీయాలతో ఒణికిపోయింది. రక్తపుధారలతో భూమి తడిసిపోయింది. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. వైఎస్సార్‌ సీపీ పాలనలో ఫ్యాక్షన్‌ గొడవలు తగ్గాయి. పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. అభివృద్ధి బాట పట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్‌ గొడవలు మళ్లీ పడగవిప్పాయి. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో అలజడి మొదలైంది. ఎప్పడు ఏ గ్రామంలో ఏం జరుగుతుందోనని పల్లె వాసులు భయపడుతున్నారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయి. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు. టీడీపీ నాయకుల దాడులకు భయపడి నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది కుటుంబాలు పుట్టి పెరిగిన ఊరిని, కుటుంబాలను వదిలిపెట్టి దూరంగా బతుకున్నారు. వైఎస్సార్‌ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ హత్య మరువక ముందే వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భర్త వెంకటరెడ్డిపై దాడిచేసి రోడ్డుపై పడేశారు. ఇలాంటి ఘటనలతో పల్లె ప్రజలు భయాందోళనతో ఉన్నారు.

యరపతినేని అండతోనే దాడులు

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలు, పోలీసుల సహకారంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులపై యథేచ్ఛగా దాడులు చేస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వివాదరహితుడైన వైఎస్సార్‌ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ని టీడీపీ నాయకులు మోటుమర్రి పేతురు, అతని తమ్ముడు కాంతారావు హత్య చేశారు. తాజాగా రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త ఆకూరి వెంకటరెడ్డిని కాపు కాసి టీడీపీ నాయకులు విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తంగేడకి చెందిన ఉప్పుతల హరికృష్ణ, కామేపల్లికి చెందిన గోగిరెడ్డి పిచ్చిరెడ్డి, జూలకల్లుకి చెందిన దొండేటి లక్ష్మారెడ్డి, నర్రెడ్డి వెంకటరెడ్డి, చల్లా అంజిరెడ్డి, పాశం అంజిరెడ్డి, తుమ్మలచెరువుకు చెందిన బక్కిరెడ్డి, మాదినపాడులో దొండేటి ఆదిరెడ్డి ఇలా చెప్పుకుంటే ఎంతోమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు.

పోలీసులతో బెదిరింపులు...అక్రమ కేసులు:

కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌ సీపీ కార్యర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడటం ఒక ఎత్తయితే...దెబ్బతిన్నవారిపైనే అక్రమ కేసులు పెట్టటం మరో ఎత్తు. గురజాల నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. రామాపురం ఎంపీటీసీ ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు దాడులు చేసి తీవ్రంగా గాయపరిస్తే ఈ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు కుటీల ప్రయత్నాలు చేశారు. వెంకటరెడ్డి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడని అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించారు. ఇదేమిటని పలువురు మీడియా ప్రతినిధులు పోలీసులను అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తికి న్యాయం చేయాల్సిన పోలీసులు టీడీపీ నాయకులకు అండగా నిలిచి తిరిగి కేసులు పెట్టే విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు లొంగకపోతే నేరుగా దాడులకు తెగబడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను వేధించటమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తప్పుబట్టుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పల్లెల్లో శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

పల్లెల్లో టెన్షన్‌..టెన్షన్‌ 1
1/1

పల్లెల్లో టెన్షన్‌..టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement