
ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో : వృద్ధుడు మృతి
ఒకరికి తీవ్ర, నలుగురికి స్వల్పగాయాలు
ఫిరంగిపురం: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలైన ఘటన శనివారం అర్థరాత్రి ఫిరంగిపురం శివారులో గుంటూరు – కర్నూలు రాష్ట్ర రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేరికపూడి గ్రామానికి చెందిన ఆరుగురు భక్తులు ఆమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారి దేవాలయంలో భజన కార్యక్రమానికి వెళ్లి.. ఆటోలో తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో ఫిరంగిపురం శివారులోని ఓ హోటల్ ముందు ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో దానిలో ప్రయాణిస్తున్న ఆర్.రామకృష్ణనాయక్(68) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కె.నాగేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా డి.ధనలక్ష్మి, జి.అంజమ్మ, జి.లక్ష్మి, కె.వెంకట సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నరసరావుపేట గవర్నమెంటు వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.