పల్లెల్లో వైద్యంపై సమ్మెట | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో వైద్యంపై సమ్మెట

Sep 30 2025 7:47 AM | Updated on Sep 30 2025 7:47 AM

పల్లెల్లో వైద్యంపై సమ్మెట

పల్లెల్లో వైద్యంపై సమ్మెట

సమ్మె సైరన్‌ మోగించిన పీహెచ్‌సీ వైద్యులు సీజనల్‌ వ్యాధుల కాలంలో సేవలకు ఆటంకం గ్రామీణ ప్రాంత ప్రజలకు తప్పని అవస్థలు జిల్లాలోని 39 పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు బంద్‌

సత్తెనపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యుల సమస్యలు నయం కాని దీర్ఘకాలిక వ్యాధుల్లా మారాయి. ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏపీపీహెచ్‌సీడీఏ) ఆధ్వర్యంలో వైద్యులు సమ్మె సైరన్‌ మోగించారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతోపాటు ఓపీ సేవలకు స్వస్తి పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల విషయంలో ప్రభుత్వ వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా వైద్యులు సోమవారం సమ్మెలోకి దిగారు. మరోవైపు సీజనల్‌ వ్యాధులు పట్టిపీడిస్తున్న తరుణంలో వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. జిల్లాలో 39 పీహెచ్‌సీలు, 26 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. పీహెచ్‌సీల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్‌లు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ తదితర నాన్‌ క్లినిక్‌లకు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినిక్‌లు 15 శాతానికి, నాన్‌ క్లినిక్‌లు 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినిక్‌ల్‌ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్లుగా ఏపీపీహెచ్‌సీడీఏ చెబుతోంది. సీహెచ్‌సీలో పని చేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్‌ సర్జన్‌న్‌గా ప్రమోషన్‌ ఇస్తుంటే... 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్నా పదోన్నతులు రాక సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌గానే మిగిలిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్‌పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు పదోన్నతులు రావడం లేదని వారు వాపోయారు. విధుల్లో చేరిన నాటి నుంచి ఉన్న క్యాడర్‌లోనే రిటైర్‌ అవుతున్న పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్‌ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రధానంగా ప్రతి పల్లె జనం విష జ్వరంతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం బారిన పడ్డారు. జేబులో డబ్బులు ఉంటే ఆర్‌ఎంపీ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ మధ్యకాలంలో జ్వరం కేసులు పెరిగాయి. ఇలాంటి తరుణంలో వైద్యుల సమ్మె పేద రోగులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు.

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 39

ఒక కేంద్రంలో కనీస వైద్యులు : 02

మొత్తం పని చేస్తున్న వైద్యులు : 110

లభించే మందుల రకాలు : 174

నిత్యం ఓపీ రోగులు: సగటున 40–50 మంది

జిల్లాలో పీహెచ్‌సీల వివరాలు

అత్యవసర సేవలకు ఇబ్బంది లేదు

జిల్లాలోని పీహెచ్‌సీలో వైద్యులు ఓపీ సేవలు మాత్రమే నిలిపివేశారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓపీ సేవలకు పీహెచ్‌సీలో మిగిలిన సిబ్బంది ఉంటారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో చర్చలు జరుపుతోంది. పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్లలేదు. రెండు రోజుల్లో అతా తెలుస్తుంది. – డాక్టర్‌ బి.రవి,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement