
జలదిగ్బంధంలో తండాలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 5,92,610 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 5,69,340 క్యూసెక్కులు 16 గేట్లను 5 మీటర్ల మేర పైకెత్తి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని వదలడంతో కృష్ణానదికి వరద ఎక్కువైంది. కంచుబోడు, జడపల్లి తండాలు జల దిగ్భందంలో ఉన్నాయి. తాడువాయిలో పత్తి పంటలలో నీటినిల్వ యథాతథంగా ఉంది. చేపలు పట్టే వారు కూడా తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయని, తాము చెప్పే వరకు నదిలో పడవలు, బల్లకట్టు వంటి సాధనాలను నడపరాదని అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, తహసీల్దారు ఎస్.చంద్రశేఖర్‌లు హెచ్చరికలు జారీ చేశారు.
దాచేపల్లి: మండలంలోని రామాపురం మత్స్యకారుల కాలనీని వరద నీరు వీడలేదు. సోమవారం కూడా కాలనీతోపాటుగా చుట్టు పక్కల వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. కృష్ణానదిలో వరద నీరు పెరగటంతో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద ఉద్ధృతి ఇంకా తగ్గకపోవటంతో అక్కడే ఉన్నారు. పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పంటపొలాలు నీట మునిగాయి. పత్తి పంట మునగటంతో పూత, పిందెలు రాలిపోయాయి. మిరప మొక్కలు ఉరకెత్తాయి. తహసీల్దార్ కె. శ్రీనివాసయాదవ్ పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

జలదిగ్బంధంలో తండాలు