
మోసపోయాం.. న్యాయం చేయండి
●జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
●ఫిర్యాదులు స్వీకరించిన
అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్
నరసరావుపేట రూరల్: ఆర్థిక మోసాలపై పలు ఫిర్యాదులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అందాయి. జిల్లా అదనపు(అడ్మిన్) ఎస్పీ జేవీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు, మెసం తదితర సమస్యలకు సంభందించిన 95 ఫిర్యాదులు అందాయి. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమలో ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ సిహెచ్.లక్ష్మీపతి, మహిళాపోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణలు పాల్గొన్నారు.
జాబ్ ఇప్పిస్తామని మోసం..
జాబ్ ఇప్పిస్తానంటే నమ్మి రూ.4.60లక్షలు మోసపోయినట్టు కనిగిరి మండల ముసలపల్లి గ్రామానికి చెందిన ఆల గోపాల్ ఫిర్యాదు చేసాడు. గుంటూరులో బీటెక్ చదివే సమయంలో మాచర్ల మండలం రాయవరంకు చెందిన యోగేంద్రతో పరిచయం ఉందని, హైద్రాబాద్‌లో కోచింగ్ తీసుకుంటూ క్యాటరింగ్ పనికి వెళ్తున్న తనకు యోగేంద్ర ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.20లక్షలు తీసుకున్నాడని పేర్కొన్నాడు. ఉద్యోగం ఇప్పించే వ్యక్తి పాపకు అనారోగ్యం అనిచెప్పి మరో రూ.1.40లక్షలు తీసుకున్నాడని వివరించాడు. జాబ్ ఇప్పించకుండా మోసం చేసిన యోగేంద్రపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.
డబ్బులు చెల్లించకుండా యానిమేటర్ మోసం..
రాజుపాలెం మండలం అంచులవారిపాలెంకు చెందిన కనకదుర్గ మహిళా పొదుపు సంఘం మే నెల కిస్తి బ్యాంక్‌కు చెల్లించకుండా యానిమేటర్ పోకల నాగలక్ష్మీ రూ.61వేలు మోసం చేసినట్టు సంఘం మహిళలు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసారు. గ్రూప్ సభ్యులం రూ.20లక్షలు లోన్ తీసుకుని ప్రతి నెల చెల్లిస్తున్నామని తెలిపారు. మే నేల నగదు గ్రూప్ సభ్యులు యానిమేటర్‌కు ఇవ్వగా ఆమె బ్యాంక్‌లో జమచేయలేదన్నారు. దీని మీద బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో యానిమేటర్‌ను ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో ఆమెతో పాటు, ఆమె భర్త దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
లక్కీ స్కీం పేరుతో మోసం ..
చరిష్మా లక్కీస్కీం పేరుతో నిర్వాహకులు 400మందిని మోసం చేసినట్టు బాధితులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసారు. చరిష్మా సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఏలూరు స్రవంతి, నాగేశ్వరరావు, నరేంద్రలు లక్కీ స్కీం ప్రారంభించడంతో 400మంది సభ్యలుగా చేరారని, ప్రతి నెల ఒక్కోక్కరు రూ.2వేలు చొప్పున 36 నెలల్లో రూ.72వేలు చెల్లించినట్టు తెలిపారు. 34వ డ్రా నుంచి విజేతలకు నగదు ఇవ్వకుండా, స్కీం సభ్యులకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. బ్రాంచ్ ఖాళీచేసినట్టు, ఫోన్ స్వీచ్ ఆఫ్ చేయడంతో మోసం పోయామని గ్రహించి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు.