
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
యడ్లపాడు: మండలంలోని జగ్గాపురం గ్రామంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు పగులగొట్టి విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు షేక్ బాజీవలి, మీరాబీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు కావడంతో కుమారుడు, కోడలు ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లోనూ, కుమార్తె, అల్లుడు వట్టి చెరుకూరు మండలం కుర్నూతల అడ్డరోడ్డు వద్ద చిల్లర కూల్‌డ్రింక్ షాపును ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బాజీవలి దంపతులు తమ కుమార్తె ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు జగ్గాపురంలోని ఇంటికి తిరిగి రాగా, రేకుల షెడ్డు ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా, కప్ బోర్డులో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దుండగులు కప్‌బోర్డులో దుస్తుల మధ్యలో దాచి ఉంచిన వెండి, బంగారం ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు బాజీవలి గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యడ్లపాడు ఎస్సై టి.శివరామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 130 గ్రాముల బంగారం, 20గ్రామలు వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు చోరీకి గురైనట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.