
పల్నాడు జిల్లా సీజనల్ వ్యాధుల భయం
జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిట
కాలనీలలో ముందుకు కదలని మురుగు
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
తాగునీటిని సరఫరా చేయకపోవడంతో రోడ్డెక్కుతున్న ప్రజలు
గతేడాది ఇదే సమయంలో డయేరియా వ్యాప్తి
పల్నాడు జిల్లాను సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోంది. ఏ ఇంటిలో చూసినా ఒకరిద్దరు బాధితులు కనిపిస్తున్నారు. బాధితులు ఆస్పత్రుల బాట పట్టడంతో ఒక్కసారిగా ఓపీలు పెరిగాయి. గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యం, కలుషిత తాగునీరు సరఫరా కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు.
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకరిద్దరు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాలో డెంగీ, అతిసార కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతూ ప్రజల్ని భయపెడుతున్నాయి. జ్వర బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రోజు ఓపీలు సాధారణంగా 450 ఉంటాయి.
వాతావరణ మార్పుల ద్వారా వస్తున్న జ్వరాల వల్ల ఓపీల సంఖ్య సుమారు 100 నుంచి 150 దాకా పెరిగాయి. వచ్చిన ఓపీలలో 40 శాతం టైఫాయిడ్, డెంగీ, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నవారే ఉన్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం 370 ఓపీలు నమోదయ్యాయి, ఇందులో సుమారు 170 దాకా జ్వర పీడితులే ఉన్నారు.
ఇలా ప్రతి ఆసుపత్రిలో ఓ వైపు సీజనల్ వ్యాధులతో నిండిపోయి ప్రమాద ఘంటికలు మోగుతుంటే ప్రభుత్వం మాత్రం మిన్నుకుండిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి, గతంలో ఇంటింటికి వైద్య, సచివాలయ సిబ్బంది వెళ్లి సర్వేలే చేసేవారు. వారికి అవసరమైన మందులు ఇంటి వద్దే అందజేసి, అవసరమైన వారికి నరసరావుపేట ఏరియా వైద్యశాలకు రెఫర్ చేసేవారు. ప్రస్తుతం అవేవి జరగడం లేదు.