
ప్రకృతి వ్యవసాయంలో రైతులు భాగస్వామ్యం కావాలి
నరసరావుపేటరూరల్:ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. బృందావనంలోని ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. అమలకమారి మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా ముందుకు వెళ్తుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయనా లు విడిచి కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పంట ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటంతోపాటు రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలతోపాటు అంతర పంటలు వేసి, చుట్టూ జొన్న–సజ్జ పంటలు నాటితే పంటకు రక్షణతోపా టు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా ఆవు మూత్రం–పేడ ఆధారంగా తయారైన సహజ కషాయాలను వాడితే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు మాట్లాడు తూ గ్రామ సమైఖ్య సంఘం పరిధిలో ప్రకృతి వ్యవసా య వనరుల కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.లక్ష నగదు అందజేస్తుందని తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఏలు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, మేరి తదితరులు పాల్గొన్నారు.