యూరియా కోసం బారులు
యూరియా కోసం బారులు ముప్పాళ్ల: యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం యూరియా కొరత లేదంటూ చెబుతున్న మాటలు ప్రకటనలే పరిమితమవుతున్నాయి. గ్రామంలోకి యూరియా లారీ వచ్చిందని తెలియగానే తెల్లవారుజామునుంచే రైతులు సంబంధిత ప్రాంతం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ముప్పాళ్ల గ్రామ సచివాలయానికి 440 యూరియా బస్తాల లారీ సోమవారం సాయంత్రం వచ్చింది. మంగళవారం పంపిణీ చేస్తారని సమాచారం తెలుసుకున్న రైతులు తెల్లవారుజామునే గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. ముందు వచ్చిన వారికి టోకెన్‌లు పంపిణీ చేశారు. కొద్దిసేపటికే పంపిణీ పూర్తయిందని చెప్పడంతో రైతులు ఖంగుతిన్నారు. చేసేది లేక వెనుదిరిగిపోయారు.
మండలంలోని రుద్రవరం గ్రామానికి కూడా లారీ యూరియా లోడు వచ్చింది. లారీని గ్రామసచివాలయం లో కాకుండా కూటమి నాయకులు చెప్పిన ప్రాంతంలో దింపి గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ పూర్తి చేశారు. కూటమి నాయకులు చెప్పిన వారికే వ్యవసాయశాఖ అధికారులు దగ్గరుండి యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద చేపట్టాల్సిన పంపిణీని ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల వద్ద చేపట్టడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుద్రవరంలో గుట్టుచప్పుడు కాకుండా...
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండల పరిధిలోని గుడిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, కొమెరపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని కట్టావారిపాలెంకు, ధూళిపాళ్ల గ్రామంలోని ఏబీఎఫ్‌ఎస్‌సీఎస్‌కు, సత్తెనపల్లి వ్యవసాయం మార్కెట్ యార్డ్‌లోని జీడీసీఎంఎస్‌కు ఒక్కొక్క దానికి 19.8 మెట్రిక్ టన్నులు చొప్పున 79.2 మెట్రిక్ టన్నుల యూరియా రావడంతో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున ఎనిమిది వందల మంది రైతులకు స్లిప్పులు పంపిణీ చేసి ఆ మేరకు యూరియా పంపిణీ చేశారు. ఈ క్రమంలో స్లిప్పులు అందుకునేందుకు రైతులు పడిగాపులు పడ్డారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో పంపిణీ చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
1/1
యూరియా కోసం బారులు