
అక్రమాలకు తావు లేకుండా రేషన్ సరకులు అందజేయాలి
పౌరసరఫరాల శాఖ గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నరసరావుపేట: పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్లలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా ఉండాలని, అక్రమాలకు తావులేకుండా సకాలంలో రేషన్ సరుకులు ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ మార్కెట్ యార్డులో రైతుబజారు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేస్తూ పౌరసరఫరాల గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు గోడౌన్‌కు పంపించిన వివిధ రకాల ప్యాకెట్లను పరిశీలించారు. పీడీఎస్ బియ్యంతోపాటు ఏఏ సరుకులు ఇస్తున్నారు, అంగన్‌వాడీ పిల్లలు, గర్భిణులకు ఇచ్చే సరుకుల ప్యాకెట్లు, మధ్యాహ్న భోజనానికి స్కూళ్లు, హాస్టళ్లకు ఇస్తున్న బియ్యం వివరాలు స్టాక్ పాయింట్ ఇన్‌చార్జి జయప్రకాష్‌ను అడిగి వాటిని పరిశీలించారు. బియ్యం సంచులు బరువు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, మార్కెటింగ్ ఏడీ కేవీఎన్ ఉపేంద్రకుమార్, పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంత్‌రావు, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు.
నాదెండ్ల: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లాబోర్డు ఆఫ్ స్టడీస్ (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్) సభ్యునిగా సాతులూరు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఎన్‌యూ డిప్యూటీ రిజిస్ట్రార్ కె రంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన న్యాయశాస్త్రంలో డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విభాగంలో సిలబస్, ఇతర అంశాల నిర్ణయాలకుగాను తొమ్మిది మంది సభ్యులతో వైస్‌ఛాన్సలర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పాటు చేశారు. ఈయన ఏఎన్‌యూ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు తరచూ అనేక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది న్యాయమూర్తులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, ప్రభుత్వ విభాగాల్లో న్యాయసలహాదారులుగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఏఎన్‌యూ న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నారు.