నాదెండ్ల: పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. ఎస్సై జి పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన మైనర్ బాలిక 2025 మే 28న గ్రామానికి చెందిన మందలపు శివప్రసాద్ తనపై అత్యాచారయత్నం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సి విజయభాస్కర్ విచారణ నిర్వహించారు. నేరం రుజువు కావటంతో నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
జిల్లాకు 1860 టన్నుల యూరియా
నాదెండ్ల: జిల్లాకు మూడో విడతగా 1860 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు చెప్పారు. సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గ్రోమోర్, డీలర్లకు నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని స్థానిక వ్యవసాయాధికారులను ఆదేశించారు. పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ఆయనతోపాటు ఏవో శ్రీలత, సిబ్బంది జీపీ శ్రీనివాసరావు ఉన్నారు.
కృషి, పట్టుదలతోనే ప్రభుత్వ ఉద్యోగాల సాధన
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు కృషి, పట్టుదలతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను సాధించాలని కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి చెందిన అధ్యాపకుడు ఎస్. నవీన్ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ పీజీ కళాశాలలో సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధతపై వెనిగండ్లలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంబీఏ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకుడు కోటేశ్వరరావు ప్రభుత్వ పోటీ పరీక్షలైన సివిల్స్, ఎస్సెస్సీతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ, బీపీసీఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలను గురించి వివరించారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ శాఖల్లో విస్కృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృషీ, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఎంబీఏ విద్యార్థులు కమ్యూనికేషన్, పరిపాలనా నైపుణ్యాలతో ప్రైవేటు రంగంలోనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం రాణించగలరని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనితాదేవి, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగాధిపతి యు. రవి కుమార్, వాణిజ్య విభాగాధిపతి ఎస్. శ్రీనివాసరావు, అధ్యాపకుడు నాంచారయ్య, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.