
గుర్తుకొస్తున్నాయి..!
నరసరావుపేట: స్థానిక శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో 1981–84 బీఏ డిగ్రీ చదివిన ఆనాటి విద్యార్థుల సమ్మేళనం కళాశాలలోని ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. అప్పటి 78 మంది విద్యార్థుల్లో 45 మంది సమ్మేళనానికి హాజరై, నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. తాము చేసిన అల్లరి, చిలిపి పనులను నెమరు వేసుకున్నారు. తమ విజ్ఞప్తి మేరకు హాజరైన అప్పటి అధ్యాపకులు, మాజీ ప్రిన్సిపాల్ ఎంఆర్‌కే మూర్తి, హరిహరనాధశాస్త్రి, శివధర్మశాస్త్రి, రాజాశంకరరావు, గ్రంథాలయాధికారి, కేవీకే రామారావులను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం తమ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, తమ కుటుంబాలు, పిల్లలను గురించి ఒకరినొకరు పంచుకున్నారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు అప్పటి విద్యార్థి నేటి గ్రానైట్ వ్యాపారి అయిన దేచవరం గ్రామానికి చెందిన బి.శివన్నారాయణ కళాశాల క్లాస్‌రూమ్‌ల ఆధునికీకరణకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. పూర్వ విద్యార్థి ఎస్.సత్యనారాయణరెడ్డి మరో రూ.లక్ష ప్రకటించారు. చనిపోయిన 22 మంది తోటి విద్యార్థులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అందరూ కలిసి భోజనాలు చేసిన అనంతరం మరోసారి కలుసుకుందామనే అంగీకారంతో బరువైన హృదయాలతో కళాశాల వీడారు. ఈ సమ్మేళనానికి అప్పటి విద్యార్థులైన జమ్ముల రాధాకృష్ణ, ఎస్.శ్రీనివాసులురెడ్డి, బొగ్గరం మూర్తి, ఇనగంటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకోగా తాళ్ల రాజశేఖరరెడ్డి, చల్లా శ్రీనివాసరావు, గుర్రం కొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
41 ఏళ్ల తరువాత కలుసుకున్న
పూర్వ విద్యార్థులు