
ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలి
నరసరావుపేట: ఇరవై ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల పేదలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక వినుకొండరోడ్డులోని సీతా మహాలక్ష్మి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన యూనియన్ పల్నాడు జిల్లా రెండో మహాసభకు యూనియన్ నాయకులు చంద్రకళ, ఎం.రత్నకుమారి, వి.రాజేశ్వరి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సీఐటీయూ జెండాను యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ ఆవిష్కరించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఏచూరి సీతారాం, సీతామహాలక్ష్మి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ధనలక్ష్మి మాట్లాడుతూ గౌరవ వేతనంతో విశేష సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సామాజిక కార్యకర్తలే ఆశా వర్కర్లన్నారు. సంఘాలు బలోపేతం చేసుకుని పోరాటాలు సాగించి హక్కులు సాధించుకోవాలన్నారు. షుగర్, బీపి, లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ వంటి అనేక రకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. పనిచేయని ఫోన్లు, సిమ్‌లు వంటి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలకు రాతపూర్వకంగా జీఓలు ఇవ్వాలన్నారు. మేనిఫెస్టో ప్రకారం ఆశావర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ లేకుండా ఆశాలు ఇంటింటికి తిరిగి చేసిన సర్వేలతో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రజారోగ్యం కోసం జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని అన్నారు. అదనపు విధులు, ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించరాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల హక్కుల సాధన, సంక్షేమం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు సత్ఫలితాలిచ్చాయన్నారు. ఆశా వర్కర్లు చేపట్టే పోరాటాలకు యూనియన్ అండగా ఉంటుందని, పోరాడి హక్కులు సాదించుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక ..
అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా కె.చంద్రకళ, గౌరవ అధ్యక్షురాలుగా డి.శివకుమారి, ప్రధాన కార్యదర్శి ఎం.రతకుమారి, కోశాధికారి ధనలక్ష్మి, మరికొందరిని సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
జిల్లా మహాసభలో యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి