
భద్రతకేదీ భరోసా?
పల్నాడు జిల్లాలో కీలక డీఎస్పీ పోస్టు ఖాళీ నరసరావుపేట డీఎస్పీని నియమించని కూటమి ప్రభుత్వం రెండు నెలలుగా ఇన్‌చార్జి డీఎస్పీతోనే సరిపెట్టిన సర్కారు కొత్త జిల్లాకు మంజూరు కాని ఎస్బీ డీఎస్పీ పోస్టు సీఐ స్థాయి అధికారులతో నెట్టుకొస్తున్న ఉన్నతాధికారులు రోజురోజుకూ పెరిగిపోతున్న అసాంఘిక కార్యకలాపాలు శాంతిభద్రతల పరిరక్షణపై తీవ్ర ప్రభావం కనీసం పట్టించుకోని కూటమి ప్రభుత్వం
స్పెషల్ బ్రాంచ్‌కు బాస్ ఏరీ?
వినుకొండలో నడిరోడ్డుపై వ్యక్తిని నరికి చంపగా చిందిన నెత్తుటి మరక పల్నాడునేకాదు రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఇది మరవక ముందే నరసరావుపేట నడిబొడ్డున కోర్టు ప్రాంగణం సాక్షిగా తండ్రి, కుమారుడిని పట్టపగలు కిడ్నాప్ చేసి హతమార్చిన ఉదంతం శాంతిభద్రతలపై వందల ప్రశ్నలు మిగిల్చింది. ఓ హెడ్ కానిస్టేబుల్ పాస్‌పోర్టు కోసం లంచం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వైరలైన వీడియోలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాన్ని చాటిచెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా పల్నాడులో కీలకమైన డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా శాంతిభద్రతలపరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతం. గత సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు నరసరావుపేట నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రౌడీ మూకలు దాడులకు తెగబడ్డాయి. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక మోసాలతో నిత్యం ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. మరోవైపు వినుకొండ, నరసరావుపేటలో నడిరోడ్లపై హత్యలు, కిడ్నాపులతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. నరసరావుపేటలో ఆర్థిక మోసాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. సాయి సాధన చిట్‌ఫండ్స్ పేరిట పుల్లారావు చేసిన మోసానికి రూ.వందల కోట్లు నష్టపోయిన బాధితుల వేదనలకు పోలీసుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. దీంతోపాటు యానిమేషన్ పేరిట కిరణ్ అనే వ్యక్తి స్కామ్ చేసి నరసరావుపేటలో వందల మందిని ముంచినా న్యాయం మాత్రం అందనంత దూరంలోనే నిలిచింది. ఇటీవల రెండు ప్రముఖ ద్విచక్ర వాహన డీలర్లు రూ.కోట్లలో అప్పులు చేసి ఉడాయించడంతో బాధితులు రోడ్డునపడ్డారు. అదేవిధంగా పేకాట, బెట్టింగ్, రేషన్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. నరసరావుపేట పోలీసు సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఇలాంటి ఘటనలు వెక్కిరిస్తున్నాయి.
ఇన్‌చార్జి డీఎస్పీయే దిక్కు
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూనే ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జీరో ఎఫ్‌ఐఆర్‌పై ఒక మహిళా న్యాయవాది సోషల్ మీడియా వేదికగా నరసరావుపేట పోలీసు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో అన్నింటినీ పర్యవేక్షించే వారు లేకపోవడమే కారణమన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో నరసరావుపేట డీఎస్పీగా పనిచేసిన కె.నాగేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవటంతో సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలలుగా ఆయన రెండు సబ్ డివిజన్లకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలోనే పెద్దదైన నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 13 పోలీసుస్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. శాంతిభద్రతల అదుపులో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వరన్యాయం అందడంలో జాప్యం చోటుచేసుకుంటోందని బాధితులు వాపోతున్నారు.
నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు సంతప్తికరమైన సేవలు అందాలన్నా పోలీసు వ్యవస్థలో స్పెషల్ బ్రాంచ్ సేవలు ఎంతో కీలకం. ముందస్తు సమాచారం తెలుసుకొని జరగబోయే అవాంఛనీయ సంఘటనల నివారణలో ఎస్బీ ముఖ్యభూమిక పోషిస్తుంది. పల్నాడు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ సేవలు సక్రమంగా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు కీలకమైన ఎస్బీ డీఎస్పీ పోస్టు మంజూరు కాలేదు. అప్పటి నుంచి సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలోనే స్పెషల్ బ్రాంచ్ నడుస్తోంది. జిల్లాలో నేరాలపై సరైన సమాచారం లేక శాంతిభద్రతల పరిరరక్షణలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దొంగతనాలు పెచ్చుమీరాయి. పట్టపగలు వినుకొండ పట్టణంలో ఒంటరి మహిళలను హత్యచేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. పార్క్ చేసిన ద్విచక్రవాహనాలు క్షణాల్లో మాయం అవుతున్నాయి. ఎక్కడికక్కడ జూద శిబిరాలు వెలిశాయి. నిఘా వైఫల్యం కారణంగానే ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పాస్‌పోర్టు విచారణలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. అమరావతిలో హెడ్ కానిస్టేబుల్ ఒకరు పాస్‌పోర్టు జారీలో రూ.2 వేలు లంచం తీసుకొని కింద నుంచి పై స్థాయి అధికారుల వరకు ఇచ్చినట్లు చెప్పిన వీడియో వైరల్ అయ్యింది.