
సత్తెనపల్లిలో భారీ వర్షం
జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు రాకపోకలకు అవస్థలు పడిన ప్రజలు నందిగామలో పొంగిపొర్లిన లో లెవెల్ చప్టా గుంటూరు రోడ్‌లో నేలకూలిన భారీ వృక్షం ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులకు ఇక్కట్లు
సత్తెనపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై సైతం నీరు భారీగా నిలిచింది. ప్రజలు అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో కాలువలు పొంగిపొర్లాయి. మురుగునీటితోపాటు వాననీరు చేరడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. ఈదురు గాలులకు గుంటూరు రోడ్‌లోని గుంటూరు బ్రాంచ్ కెనాల్ కాలువ సమీపంలో భారీ వృక్షం నేలకూలింది. దాదాపు ముప్పావు గంటకుపైగానే ట్రాఫిక్ నిలిచిపోయింది. వృక్షాన్ని తొలగించి అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. నందిగామలో లో లెవెల్ చప్టాపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గురప్రుడెక్క ఎక్కువగా పెరగడంతో ఈ సమస్య తలెత్తింది. కొందరు ద్విచక్ర వాహనాలతో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని నాగన్నకుంట ఏరియా, సుందరయ్య కాలనీ, మాస్ట్రీన్‌పేట, దోబీఘాట్ తదితర ప్రాంతాల్లో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

సత్తెనపల్లిలో భారీ వర్షం