
వైద్య విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వం
సత్తెనపల్లి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ–పీపీపీ విధానం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ సుధీర్ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఇందులో ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయని, మిగిలిన కళాశాలలు చివరి దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీలు నిర్వహణ చేపట్టలేమని కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించాలని పీపీపీ విధానం తీసుకురావడం సరైనది కాదన్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చాక ఉన్న సంపదను అమ్మేస్తున్నారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రయత్నం చేయకపోగా .. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మేల్కొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్సార్ సీపీ తరఫున అడ్డుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు సత్తెనపల్లి లోని చెక్‌పోస్ట్ వద్ద నుంచి చేపట్టే చలో పిడుగురాళ్ల(కామేపల్లి) ప్రభుత్వ వైద్య కళాశాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, యువకులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్, నాయకులు పక్కాల సూరిబాబు, రాజారపు శివనాగేశ్వరరావు, షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీనివాసరావు, వేపూరి శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, బండి కోటినాగిరెడ్డి, అచ్యుత శివప్రసాద్, వేల్పుల వెంకటేశ్వర్లు, యాసారపు బాబు, కంఠమనేని చందు, మేడ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొలమారి వెంకట్రామిరెడ్డి, ముక్త్యార్, సయ్యద్ గోర, కొణతం స్వాతి తదితరులు ఉన్నారు.