
రైతుల సమస్యలపై ప్రశ్నించే అధికారం లేదా ?
●మాజీ మంత్రి విడదల రజిని
●అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు
చిలకలూరిపేట: ప్రజాస్వామ్యంలోనే ఉన్నాంకదా... రైతుల సమస్యలపై శాంతియుతంగా కార్యక్రమం చేపడితే అడ్డుకోవడం ఏమిటి... ఇది నియంతృత్వాన్ని తలపిస్తోంది అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని విమర్శించారు. అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమౌతున్న మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు మంగళవారం ఆమె నివాసం వద్ద అడ్డుకొని నోటీసులు అందించారు. అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవని మాజీ మంత్రికి పోలీసులు తెలిపారు. ఉదయం నుంచే చిలకలూరిపేట పట్టణ ఎస్‌ఐ డి చెన్నకేశవులు, రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్, నాదెండ్ల ఎస్‌ఐ పుల్లారావు సిబ్బందితో కలసి మాజీ మంత్రి నివాసానికి చేరుకున్నారు. కార్యక్రమానికి బయలుదేరిన ఆమెను వెళ్లవద్దంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో మాజీ మంత్రి పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా కూడా రైతుల కోసం నిరసన కార్యక్రమం నిర్వహించే అవకాశం కూడా ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. తాము ప్రజలను పోగు చేయలేదని, కేవలం పార్టీ నాయకులతో కలసి నరసరావుపేటకు వెళ్లి ఆర్డీవోకు రైతుల సమస్యలతో కూడిన మెమోరాండం ఇచ్చేందుకు మాత్రమే వెళుతున్నామని, ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగే సమస్య ఎక్కడుందని పోలీసులను నిలదీశారు. ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియా కూడా అందజేయలేని పరిస్థితుల్లో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మేము ఎందుకు ప్రశ్నించకూడదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమానికి ఖచ్చితంగా వెళ్లి తీరుతామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు తమ ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామని చెప్పి, ఉన్నతాధికారులతో చర్చించి రెండు కార్లు మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు. దీంతో రెండు కార్లలో ఆమె నరసరావుపేటకు తరలివెళ్లారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహరావు, మంగు ఏడు కొండలు, పార్టీ వివిధ విభాగాల నాయకులు ఉన్నారు.