
సీఎం సభకు బస్సులు.. విద్యార్థులకు చిక్కులు
అచ్చంపేట: అనంతపురంలో సీఎం మీటింగ్‌కు సత్తెనపల్లి డిపో నుంచి ఆర్టీసీ బస్సులు పండంతో పాఠశాల విద్యార్థులు బుధవారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక రోజు అయితే సరిపెట్టుకోవచ్చు.. పల్లె వెలుగు బస్సులు మూడు రోజుల పాటు గ్రామాలకు వెళ్లలేదు. సత్తెనపల్లి నుంచి మాదిపాడు రూట్లలో రోజులో కనీసం 25 ట్రిప్పులు తిరుగుతాయి. ఇందుకోసం సుమారు 20బస్సుల వరకు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం మూడింటిని మాత్రమే తిప్పుతున్నారు. మాదిపాడుకు గంటకో బస్సుకు గానూ నాలుగు, అయిదు గంటలకు ఒకసారి మాత్రమే తిప్పారు. ఇక రోకటిగుంటవారిపాలెం, తాళ్లచెరువు, కస్తల, కోనూరు గ్రామాలకు పూర్తిగా నిలిపివేశారు. ఈ పరిస్థితి మంగళవారం, బుధవారంతో పాటు గురువారం మధ్యాహ్నం వరకు ఉంటుందని ఆర్టీసీ వారే చెబుతున్నారు. దీంతో అచ్చంపేట పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆటోలు, మిని లారీలను ఆశ్రయించారు. రోకటిగుంటవారిపాలెం నుంచి 30మందికి పైగా అచ్చంపేట హైస్కూలులో చదువుతున్నారు. బస్సులు రాకపోవడంతో తల్లిదండ్రుల మినీ ఆటోను మాట్లాడుకుని పిల్లలను దగ్గరుండి ఎక్కించి పంపారు.