
దోపిడీలతో భీతిల్లుతున్న పేట ప్రజలు
గతంలోనూ ఇదే తరహా దోపిడీలు
నరసరావుపేట రూరల్: వరుస దారి దోపిడీలతో నరసరావుపేట ప్రజలు భీతిల్లుతున్నారు. దుండగులు దోపిడీలతో పాటు మహిళలపై కూడా లైంగిక దాడులకు పాల్పడటంతో భయపడిపోతున్నారు. ఇటీవల కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడి చేసి బంగారం దోపిడీ చేయడంతో పాటు మహిళపై లైంగికదాడియత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసుల అదుపులో యువకుడు
ఐదుగురు యువకులు ఈ ఘతకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించి అందులో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని గోనెపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుమారుడుతో కలిసి రెండు రోజుల కిందట కారులో నరసరావుపేటలో పనిముగించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. చినతురకపాలెం– గోనెపూడి రహదారి గుంతలతో అధ్వానంగా ఉండటంతో గురవాయపాలెం మీదగా పయనమయ్యారు. మార్గంమధ్యంలో స్టోన్‌క్రషర్ సమీపంలో వీరు వెళ్తున్న కారును ఐదుగురు యువకులు అటకాయించారు. బలవంతంగా అందులోని వారిని బయటకు లాక్కెళ్లారు. మహిళ మెడలో బంగారు అభరణాలు దోచుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిపై బీరు సీసాతో దాడికి పాల్పడ్డారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె దుస్తులను చించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో నివాసం ఉండే వారు వస్తారన్న భయంతో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ప్రాణభయంతో గ్రామానికి చేరుకున్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని గ్రామంలో బంధువులకు, సన్నిహితులకు వివరించారు. వెంటనే అదే రోజు రాత్రి గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అఘాయత్నానికి పాల్పడిన వారిలో గురవాయపాలేనికి చెందిన యువకులను బాధితులు గుర్తించారు. నిందితులు నివాసం ఉండే కాలనీ వద్దకు బాధితుల బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బెదిరించి దారి దోపిడీ
గురవాయపాలెం దారి దోపిడీ ఘటన మరువకే ముందే తాజాగా మంగళవారం రాత్రి మరొకటి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తూరుకు చెందిన గోళ్లపాడు నాని తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో తాపిమేస్త్రిగా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో స్వగ్రామం వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో సంతమాగులూరు అడ్డరోడ్డుకు వెళ్లేందుకు బస్టాండ్ ఎదుట ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత మార్గంమధ్యంలో మరో వ్యక్తి ఆటో ఎక్కాడు. పెట్లూరివారిపాలెం గ్రామ సమీపంలోని చిలకలూరిపేట మేజర్ కాలువ కట్ట వైపునకు దారి మళ్లించారు. కట్టపై కొంతదూరం తీసుకువెళ్లి కత్తులతో బెదిరించారు. అతిడి దగ్గర ఉన్న రెండు సెల్‌ఫోన్‌లు, నగదు, వెండి చైన్‌లను దోచుకున్నారు. బాధితుడు అర్ధరాత్రి రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులును పోలీసులు అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నట్టు తెలిసింది. గురవాయపాలెం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ కిశోర్ తెలిపారు. ప్రయాణికుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసులో సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
గురవాయపాలెం వద్ద జరిగిన దారి దోపిడీ వంటి ఘటనలు ఈ ప్రాంతానికి కొత్తేమి కాదని స్థానికులు అంటున్నారు. గురవాయపాలెం, గొనెపూడి, కోటప్పకొండ శివారు ప్రాంతాల్లో కాపుకాచి ఒంటరిగా వస్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకొని బంగారం, నగదు దోచుకుంటున్నారని తెలియవచ్చింది. అయితే, కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా మరి కొంతమంది ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు ఇచ్చిన సమాచారంతో దోపిడీలో ఐదుగురు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు తురకపాలెంలో తరచూ జరిగే పేకాటలో పాల్గొన్నట్టు తెలిసింది. నిందితులపై పలు పోలీస్‌స్టేషన్‌లలో దారి దోపీడీ, చోరీ కేసులు ఉన్నట్టు పోలీసు వర్గాల ద్వారా సమాచారం.