
పల్నాడుకు జ్వరం
వాతావరణ మార్పులతో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిట గత ప్రభుత్వంలో ఇంటింటికీ సిబ్బంది వెళ్లి సర్వే రోగులను గుర్తించి వైద్య సేవలు కూటమి ప్రభుత్వం నిర్లిప్తతపై ప్రజల ఆగ్రహం పారిశుద్ధ్య నిర్వహణపై విమర్శలు ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు కరువు గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
జిల్లాలో విస్తరిస్తున్న జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర రోగాలు
సాక్షి, నరసరావుపేట : పల్నాడు జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెల్లు పల్లెలు జ్వరాలతో మంచానపడ్డాయి. ఇంటికొకరు ఇద్దరు చొప్పున జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో గత 20 రోజులుగా సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలో ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రోజు ఓపీలు సాధారణంగా 450 ఉంటాయి. అయితే, వాతావరణ మార్పుల ద్వారా వస్తున్న జ్వరాల వల్ల ఓపీల సంఖ్య సుమారు 100 నుంచి 150 దాకా పెరగాయి. వచ్చిన వారిలో 40 శాతం టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నవారే ఉన్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి జ్వరం, జలుబు, దగ్గు, అతిసార లక్షణాలతో బాధపడుతూ వచ్చే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరంపై దద్దర్లు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో చిన్నారులు వైద్యాశాలలో చేరుతున్నారు. ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లే రోగులకు సుమారు రూ. 5 వేల దాకా ఖర్చు అవుతోంది. రక్త పరీక్షలు, విషజ్వరాలకు ప్రత్యేకంగా ఫ్లూయిడ్స్ పేరిట రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. పోనీ ప్రభుత్వ వైద్యశాలలకు వెళదామంటే అక్కడ మందుల లేమికి తోడు సిబ్బంది నిర్లక్ష్యంతో అటువైపు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ వైద్యశాలల్లో రక్తపరీక్షల వద్ద రద్దీ అధికంగా ఉంది. రిపోర్ట్స్ అందించడంలో కూడా ఆలస్యం చేస్తుండటంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీజన్‌ల వ్యాధులు ప్రబలుతున్నాయన్న సమాచారం రాగానే ఇంటింటికీ సచివాలయ, వైద్య సిబ్బంది వెళ్లి సర్వే నిర్వహించేవారు. ఇందులో ఎవరైనా జ్వర లక్షణాలతో బాధపడుతున్నారా? ఎంతమందికి లక్షణాలు ఉన్నాయి? ఏ మందులు వాడాలి.. ఏ ఆసుపత్రికి వెళ్లాలో సలహాలు, సూచనలు సైతం చేసేవారు. అవసరమైన మందులు ఇంటి వద్దే అందజేసేవారు. మరోవైపు గ్రామాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరిగేది. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపేవారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు తక్కువగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దీంతో ఇంటింటికీ ఫీవర్ సర్వే సరిగా జరగడం లేదు. ఎక్కడ జ్వరబాధితులు అధికంగా ఉన్నారో తెలియడం లేదు. మరోవైపు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో సీజనల్ వ్యాధులు అధికమవుతున్నాయి. గతంలో ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు, సిబ్బంది గ్రామాలకు వెళ్లి మెరుగైన వైద్యం ఉచితంగా అందించేవారు. ప్రస్తుతం అది లేకపోవడంతో ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పల్నాడుకు జ్వరం

పల్నాడుకు జ్వరం